పోలీసుల అదుపులో క్రికెట్‌ బుకీలు | - | Sakshi
Sakshi News home page

పోలీసుల అదుపులో క్రికెట్‌ బుకీలు

May 15 2026 10:14 AM | Updated on May 15 2026 10:14 AM

ప్రొద్దుటూరు క్రైం : ప్రొద్దుటూరులో క్రికెట్‌ బుకీల ఇళ్లపై పోలీసులు దాడులు నిర్వహించారు. దాడిలో ముగ్గురు బుకీలను అదుపులోకి తీసుకోగా గాంధీరోడ్డులోని ప్రధాన క్రికెట్‌ బుకీ తప్పించుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. హిందూపురంలో క్రికెట్‌ నిర్వహిస్తూ అక్కడి బుకీలు కొందరు రెండు రోజుల క్రితం పోలీసులకు పట్టుబడ్డారు. పట్టుబడిన క్రికెట్‌ బుకీలకు ప్రొద్దుటూరులోని ఇద్దరు బుకీలకు సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ ఇద్దరి ద్వారా గాంధీరోడ్డులోని ఒక ప్రధాన బుకీకి లింక్‌ ఉన్నట్లు పోలీసుల విచారణలో బహిర్గతమైంది. దీంతో రూరల్‌ పోలీసులు బుధవారం అర్దరాత్రి సమయంలో ఏక కాలంలో బుకీల ఇళ్లపై దాడులు నిర్వహించి ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లు తెలిసింది. పోలీసుల రాకను పసిగట్టిన గాంధీరోడ్డులోని క్రికెట్‌ బుకీ తప్పించుకున్నట్లు సమాచారం. పెద్ద మొత్తంలో డబ్బు కూడా దొరికినట్లు తెలుస్తోంది. పట్టుబడిన బుకీలను పోలీసులు విచారణ చేస్తున్నారు. వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు కూపీ లాగుతున్నారు. బుకీల మధ్య ఉన్న లింకులను గుర్తిస్తూ పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది.

5 మేకలు చోరీ

బద్వేలు అర్బన్‌ : మండల పరిధిలోని చింతలచెరువు పంచాయతీ అబ్బుసాహెబ్‌పేట గ్రామంలో 5 మేకలు చోరీకి గురైనట్లు రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలు..పట్టణంలోని విద్యానగర్‌లో బోవిళ్ళఎరికలరెడ్డి, సుజాత దంపతులు నివసిస్తుంటారు. ఎరికలరెడ్డి అబ్బుసాహెబ్‌పేట గ్రామంలో కొంత పొలాన్ని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. పొలం వద్దనే గేదెలను, మేకలను కూడా పోషించుకుంటుండేవాడు. ఈ క్రమంలో బుధవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు 5 మేకలు చోరీ చేసినట్లు సుజాత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రంగారావు తెలిపారు.

పీజీ ఈసెట్లో ఒంటిమిట్ట విద్యార్థి ప్రతిభ

ఒంటిమిట్ట (సిద్దవటం): ఇటీవల జరిగిన పీజీ ఈసెట్‌ పరీక్షల్లో ఒంటిమిట్ట లోని నాగేటి తిప్పపై నివాసం ఉంటు న్న కె.నరసింహులు, కె.లక్ష్మీదేవి దంపతుల కుమారుడు కె.శంకరయ్య ప్రతిభ కనబరిచాడ. స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంక్‌ వచ్చినట్లు కుటుంబసభ్యులు గురువారం తెలిపారు. విద్యార్థి కె.శంకరయ్య రాజంపేట ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీలో పాలిటెక్నిక్‌, తిరుపతి ఎస్వీ యూనివర్శిటీలో బీటెక్‌ను కూడా పూర్తి చేశాడు. ఇటీవల జరిగిన పీజీ ఈసెట్‌ పరీక్ష ఫలితాల్లో కె.శంకరయ్య 120 మార్కులకు 90 మార్కులు సాధించి స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంకర్‌గా నిలిచాడు.కుటుంబసభ్యులు, గ్రామస్తులు శంకరయ్యను అభినందించారు.

బాధ్యతలు అప్పగింత

కడప ఎడ్యుకేషన్‌: నూతన డీఎస్‌ఓగా నియమితులైన లేబాక బాలాజీకి మాజీ డీఎస్‌ఓ వేపరాల ఎబినేజర్‌ గురువారం బాధ్యతలు అప్పగించారు. బాధ్యతలు చేపట్టిన బాలాజీని సర్‌ సీవీ రామన్‌ సైన్స్‌ క్లబ్‌ గౌరవాధ్యక్షులు డా. గునిశెట్టి శ్రీనివాసులు ఆధ్వర్యంలో క్లబ్‌ సభ్యులు కలిశారు. పూలమాలతో సన్మానించారు.కార్యక్రమంలో డీసీఈబీ సెక్రటరీ చంద్రశేఖర్‌ రావు, సైన్స్‌ మ్యూజియం కురేటర్‌ రెహమా న్‌, మాజీ డీఎస్‌ఓలు ఎబినేజర్‌, నిత్యానంద రెడ్డి, క్లబ్‌ సభ్యులు గంగాధర్‌, మఽ దుసూదన్‌, క్రిష్ణ కిషోర్‌, బాలకష్ణ, ఎన్జీసీ కన్వీనర్‌ విజయ ప్రసాద్‌ పాల్గొన్నారు.

గంజాయి కేసులో ఐదుగురు నిందితుల అరెస్టు

కడప అర్బన్‌: కడప పాత బస్టాండు సమీపంలో గురువారం గంజాయి విక్రయిస్తున్న ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు కడప వన్‌ టౌన్‌ సీఐ చిన్న పెద్దయ్య తెలిపారు. సీఐ వివరాల మేరకు కడప వక్కల పేట గూడూరు హరిజనవాడకు చెందిన ఖాజా ఆరిఫ్‌ అహ్మద్‌ అల్యూమినియం పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కడప అల్మాస్‌పేటకు చెందిన షేక్‌ గౌస్‌ పీర్‌ అలియాస్‌ కచ్చా ఐడిల్‌ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కడప నకాష్‌ చెందిన షేక్‌ రియాజ్‌ పండ్ల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. కడప అగాడివీధికి చెందిన పఠాన్‌ మహమ్మద్‌ గౌస్‌ డ్రైవర్‌ గా పనిచేస్తున్నాడు. కడప చిలకల బావి లో ఉన్న సవైపుర స్ట్రీట్‌ కి చెందిన పఠాన్‌ అబ్దుల్లా అలియాస్‌ ఆతుల్లా ఖాన్‌లు బ్యాచ్‌ గా తయారై, ఇతర ప్రాంతాల నుంచి గంజాయి కొనుగోలు చేసి ఇక్కడి వారికి పొట్లాలు చేసి విక్రయిస్తున్నట్లు సమాచారం వచ్చిందన్నారు. కడప ఇన్‌చార్జి డీఎస్పీ బాలస్వామి రెడ్డి ఆదేశాల మేరకు ఐదుగురిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి 1200 గ్రాముల గంజాయి, రెండు సెల్‌ ఫోన్లు, రూ.1500 నగదును స్వాధీనం చేసుకున్నారు. వారిని కోర్టులో మెజిస్ట్రేట్‌ ముందు హాజరుపర్చగా రిమాండ్‌కు తరలించారు.

మహిళపై దుర్భాషలాడిన ఆర్టీసీ కండక్టర్‌

కడప అర్బన్‌: కూటమి ప్రభుత్వం అమలు చేసిన సీ్త్ర శక్తి పథకానికి తూట్లు పొడిచేలా ఆర్టీసీ సిబ్బంది అసహనానికి గురవుతూ మహిళలపై దుర్భాషలాడుతున్నారు. తాజాగా కడప నగరంలో ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు ఎక్కేందుకు ప్రయత్నించిన మహిళను కండక్టర్‌ దుర్భాషలడటం, కొట్టడానికి ప్రయత్నించడం లాంటి సంఘటన ఇందుకు నిదర్శనం. బాధితురాలు తిరుపపులి వాణి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఈ విధంగా పేర్కొంది. కడపలోని రామాంజనేయ పురం జర్నలిస్ట్‌ కాలనీకి చెందిన వాణి తన కుమార్తెకు సంబంధించిన అప్లికేషన్‌ తీసుకొచ్చేందుకు గురువారం మధ్యాహ్నం కడపకు వచ్చింది. నారాజుపేటలోని సన్‌రైజ్‌ హాస్పిటల్‌ ఎదురుగా పాత బస్టాండ్‌కు వెళ్లేందుకు ఆ మార్గంలో వెళుతున్న ఆర్టీసీ బస్సును నిలిపి ఎక్కడానికి ప్రయత్నించింది. బస్సు ఎక్కగానే కండక్టర్‌ దుర్భాషలాడుతూ.. మహిళా అని చూడకుండా కొట్టడానికి ప్రయత్నించాడు. బస్సులో నుంచి బయటకు తోసేసి వెళ్లిపొమ్మన్నాడు. దీంతో పాత బస్టాండ్‌ లో ఉన్న డ్యూటీలో ఉన్న పోలీసులకు తెలియజేసింది. పోలీసుల సమక్షంలోనే కండక్టర్‌, తనపైనే ఫిర్యాదు చేస్తావా? అంటూ మహిళను కొట్ట బోయాడు. పోలీసులు అడ్డుకున్నారు. తనపై దాడికి ప్రయత్నించిన కండక్టర్‌ పై మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటనపై కడప వన్‌ టౌన్‌ పోలీసులు విచారణ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement