● కులమతాల మధ్య చిచ్చు పెట్టాల్సిన అగత్యం వైఎస్సార్‌సీపీకి పట్టలేదు
● మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాష
కడప కార్పొరేషన్: ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే తమపై నిందలు వేస్తున్నారని మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాష విమర్శించారు. కడపలోని తన కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కడప నగరం మతసామరస్యానికి ప్రతీక అని, కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ ఏ చిన్న సంఘటన కూడా చోటు చేసుకోలేదన్నారు. తిరుమల తొలిగడప దేవునికడప, పెద్దదర్గా, మరియపురం చర్చిలు ఇక్కడ చాలా ప్రసిద్ధిగాంచాయని, సుదూర ప్రాంతాల నుంచి కులమతాలకు అతీతంగా భక్తులు వీటిని సందర్శిస్తుంటారన్నారు. ఇలాంటి శాంతియుత నగరంలో అల్లర్లు జరగడం పట్ల తాము చాలా చింతిస్తున్నామన్నారు. ప్రజలంతా కులమతాలకు అతీతంగా ఘర్షణ ఘటనను తీవ్రంగా ఖండించారని గుర్తు చేశారు. మతసామరస్యాన్ని కాపాడాల్సిన బాధ్యత పత్రికలు, మీడియా, రాజకీయ పార్టీలపై ఉందన్నారు. ఆ విషయాన్ని మర్చిపోయి కొన్ని పచ్చ పత్రికల్లో అల్మాస్‌పేటలో జరిగిన ఘటనకు వైఎస్సార్‌సీపీ నాయకులే కారణమని కథనాలు రావడం దురదృష్టకరమన్నారు. జర్నలిజం విలువలు ఇవేనా అని ఆయన ప్రశ్నించారు. సున్నితమైన అంశంపై ఎలా రాయాలో జర్నలిజం నేర్పలేదా అని నిలదీశారు. రెచ్చగొట్టే కథనాలు రాసి రాజకీయ రంగు పులిమే ప్రయత్నం చేయడం దుర్మార్గమైన చర్య అన్నారు. అల్మాస్ పేట ఘటనను కొన్ని దుష్ట శక్తులు ప్రేరేపించాయని.. టీడీపీ నగర అధ్యక్షుడు, మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ ఇరువర్గాలకు ప్రాతినిధ్యం వహించారన్నారు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా వైఎస్సార్‌సీపీకి అంటగట్టే కార్యక్రమం జరుగుతోందని ఆరోపించారు. ఈ రెండేళ్ల కాలంలో ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రతిదాన్నీ రాజకీయం చేస్తున్నారని, పక్కా ప్రణాళిక ప్రకారం వైఎస్సార్‌సీపీకి అంటగడుతున్నారన్నారు. పెద్ద దస్తగిరి హత్య విషయంలో కూడా ఇలాగే జరిగిందని గుర్తు చేశారు. రెండు గంజాయి బ్యాచ్‌లకు మధ్య జరిగిన ఘర్షణను వైఎస్సార్‌సీపీ నాయకులకు అంటగట్టారని గుర్తు చేశారు. శవరాజకీయాలు, కలమతాల మధ్య చిచ్చురేపడంలో చంద్రబాబును మించిన వారు దేశంలోనే లేరన్నారు. ప్రభుత్వాన్ని కాపాడుతూ వస్తున్న పచ్చ పత్రికల ద్వారా కథనాలు రాయించి, టీడీపీ నాయకులతో ప్రెస్‌మీట్లు పెట్టించి అవే నిజం అనేలా ప్రజలను మభ్యపెడతారన్నారు. ఇందులో భాగంగానే ప్రభుత్వ సలహాదారు షరీఫ్ వ్యాఖ్యలు చేశారని, చంద్రబాబు నుంచి వచ్చిన స్క్రిప్టును ఆయన బాగా చదివి వినిపించారని ఎద్దేవా చేశారు. స్తానిక సంస్థల ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో లబ్ధి పొందేందుకు ఈ కుట్రలు చేయించారని షరీఫ్ చెప్పడం హాస్యాస్పదమన్నారు. కడపలో వైఎస్సార్‌సీపీకి ఇంకా ఆ దుస్థితి పట్టలేదన్నారు. ఇలాంటి నీచ రాజకీయాలు చేసి లబ్ధి పొందాల్సిన అవసరం అంతకన్నా లేదని, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా అన్ని స్థానాలు కై వసం చేసుకునే సత్తా తమ పార్టీకి ఉందన్నారు. కులమతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందడం టీడీపీకి మొదటి నుంచి అలవాటని, వారి చరిత్ర అదేనన్నారు. ఎందుకంటే టీడీపీకి చాలా డివిజన్లలో సరైన అభ్యర్థులే కరువయ్యారని ఎద్దేవా చేశారు. ఎవరైనా బాత్‌రూమ్‌లో కాలు జారిపడినా, ఆవు ఈనిందన్నా వైఎస్సార్‌సీపీ వల్లే జరిగిందని చెప్పే స్థితికి టీడీపీ నాయకులు దిగజారారన్నారు. కడప నగర అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా కూటమి ప్రభుత్వం ఇవ్వలేదన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఏమేం అభివృద్ధి చేశామో కళ్లకు కట్టినట్లు చూపుతామన్నారు. అవకాశం వచ్చినప్పుడు ప్రజలు వారి విశ్వరూపం చూపుతారని అంజద్‌బాషా హెచ్చరించారు. ఈ సమావేశంలో మాజీ మేయర్ పాకా సురేష్ కుమార్, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పి.జయచంద్రారెడ్డి, బంగారు నాగయ్య, తోటక్రిష్ణ, బీహెచ్ ఇలియాస్, దాసరి శివప్రసాద్, బసవరాజు, రాయల్‌బాబు, అక్బర్ అలీ, త్యాగరాజు పాల్గొన్నారు.


