బద్వేలు అర్బన్ : బద్వేలు సమీపంలోని గూడెం గ్రామానికి చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు వలపు వల విసిరి లక్షలు కొల్లగొట్టిన ఓ యువకుడు, యువతిని అర్బన్ పోలీసులు అరెస్టు చేశారు. గురువారం అర్బన్ పోలీసుస్టేషన్ ఆవరణలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అర్బన్ సీఐ బి.రామకృష్ణ ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. మున్సిపాలిటీ పరిధిలోని గూడెం గ్రామానికి చెందిన ఊరిబిండిఅశోక్ చైన్నెలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా జీవనం సాగిస్తున్నాడు. సుమారు రెండేళ్ళ క్రితం అశోక్ ఇన్‌స్ట్రా ఐడీకి పూజితరెడ్డి0707 అనే ఇన్‌స్ట్రా ఐడీ నుండి హాయ్ అని మెసేజ్ వచ్చింది. ఆ తర్వాత అదే గ్రామానికి చెందిన అతని సమీప బంధువు ఆదూరిరామలింగారెడ్డి అశోక్‌తో చర్చించి ముందస్తు పథకం ప్రకారం అతనితో పరిచయమున్న మానక అలియాస్ పూజితరెడ్డితో పరిచయం పెంచుకోమని అశోక్‌కు సూచించాడు. ఆ తర్వాత కొద్ది రోజులకు పూజిత తన ఆర్థిక ఇబ్బందులను చెప్పి బాధపడుతూ మెల్లగా అశోక్ వద్ద డబ్బులు గుంజడం మొదలుపెట్టింది. ఇలా అనేక దఫాలుగా వివిధ అకౌంట్లకు సుమారు రూ.81.67 లక్షలు స్వాహా చేశారు. పూజితరెడ్డి వ్యవహారశైలిలో అనుమానం వచ్చిన అశోక్ పూర్తిస్థాయిలో విచారించుకుని తనను ఉద్దేశ్యపూర్వకంగా రామలింగారెడ్డి, మానసలు మోసం చేశారని గుర్తించి గత నెల 29న అర్బన్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించి గురువారం చెన్నంపల్లె ప్లైఓవర్ వద్ద రామలింగారెడ్డి, మానసలను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు ప్లే99ఎక్ఛేంజ్, స్కైఎక్ఛేంజ్, పేట్రస్ట్ యాప్‌లను వాడినట్లు విచారణలో తేలింది. అలాగే నిందితులు మోసం చేసి తీసుకున్న డబ్బులు మొత్తం క్రికెట్ బెట్టింగ్‌లలో వాడినట్లు దర్యాప్తులో తేలిందని తెలిపారు. సమావేశంలో అర్బన్ ఎస్‌ఐ ఆర్.వి.కొండారెడ్డి, కానిస్టేబుళ్ళు వెంకటేష్, వీణ తదితరులు పాల్గొన్నారు.
హనీట్రాప్‌కు పాల్పడిన
యువతి, యువకుడు అరెస్టు


