● పదేళ్ల నాటి ఇంటి పునాదుల కూల్చివేత
● ఆర్డీఓకు కార్యాలయానికి వెళ్లిన
బాధితులు, వైఎస్సార్‌సీపీ నాయకులపై దౌర్జన్యం
పులివెందుల : పులివెందులలో టీడీపీ నాయకుల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. ప్రభుత్వం పదేళ్ల క్రితం కేటాయించిన ఇంటి స్థలాల్లో పేదలు నిర్మించుకున్న పునాదులను టీడీపీ నాయకులు కూల్చివేస్తున్నారు. బాధితుల కథనం మేరకు.. 2014లో పులివెందుల పట్టణంలోని చిన్నరంగాపురం రోడ్డు రాజీవ్ కాలనీ పక్కన ఉన్న విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద ఉన్న డీకేటీ స్థలంలో 50 కుటుంబాలకు అప్పటి ప్రభుత్వం ఇళ్లులేని నిరుపేదలకు ఇంటి స్థలాలను మంజూరు చేసింది. అప్పట్లో వారు పునాదులు నిర్మించుకున్నారు. ప్రస్తుతం టీడీపీ మైనార్టీ నాయకుడి కన్ను పేదల స్థలాలపై పడింది. ఆ స్థలం తనదంటూ రెండు రోజుల క్రితం పేదలు నిర్మించుకున్న ఇళ్ల పునాదులను కూల్చివేశాడు. గురువారం ఈ విషయాన్ని బాధితులు ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్లాలని కార్యాలయానికి చేరుకున్నారు. బాధితులకు వైఎస్సార్‌సీపీ నాయకులు బాసటగా నిలిచారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుని అక్కడే ఉన్న బాధితుల చేతుల్లో ఉన్న పట్టా కాగితాలను, జిరాక్స్ కాఫీలను లాక్కొని దౌర్జన్యం చేశారు. అంతేకాకుండా ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓతో మాట్లాడుతున్న వైఎస్సార్‌సీపీ నాయకులపై దౌర్జన్యం చేశారు. దీనికి వైఎస్సార్‌సీపీ నాయకులు కూడా దీటుగా సమాధానం ఇచ్చారు. ఇంతలో ఇరు పార్టీలకు సంబంధించిన నాయకులు పెద్ద సంఖ్యలో ఆర్డీఓ కార్యాలయానికి చేరుకున్నారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలను శాంతింపజేసి ఆర్డీఓతో పోలీసుల మాట్లాడారు. దీనికి ఆర్డీఓ ఆ స్థలాలపై సర్వే చేపడతామని, సర్వే చేసిన తర్వాత విషయం తెలియజేస్తామని చెప్పడంతో ఇరు వర్గాల వారు అక్కడి నుంచి వెళ్లారు.


