కడప ఎడ్యుకేషన్: ఏపీ ఈఏపీ సెట్‌కు సంబంధించి మంగళవారం రెండు సెషన్స్‌లో నిర్వహించిన ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షలకు సంబంధించి జిల్లావ్యాప్తంగా 93.59 శాతం మంది విద్యార్థుల హాజరయ్యారు. జిల్లావ్యాప్తంగా కడప, ప్రొద్దుటూరు, రాజంపేటలలో కలిసి 9 పరీక్షా కేంద్రాలకుగాను రెండు సెషన్స్‌కు సంబంధించి 1668 మంది అభ్యర్థులకుగాను 1561 మంది హాజరయ్యారు.
కడప ఎడ్యుకేషన్: జిల్లాలోని గవర్నమెంట్, జిల్లా పరిషత్తు, మున్సిపల్ కార్పొరేషన్, కడప, ప్రొద్దుటూరు మునిసిపాలిటి పరిధిలో పనిచేస్తున్న సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు, తత్సమాన కేటగిరిల పాఠశాలల సహాయకులు తుది సీనియారిటి జాబితా( టీచర్ ఇన్ఫర్మెషన్ సిస్టమ్ ఆధారంగా) సబ్జెక్టుల వారిగా డీఈఓ వెబ్‌సైట్‌లో పొందు పరిచినట్లు డీఈఓ షేక్ షంషుద్దీన్ తెలిపారు. తుది సీనియారిటి జాబితాలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 19వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు రాత పూర్వకంగా సరైన ఆధారాలతో సంప్రదించాలని పేర్కొన్నారు.
పులివెందుల రూరల్: పులివెందుల మండలం నల్లపురెడ్డిపల్లె గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు మంచి మార్కులు సాధించడంతో దాతల సాయంతో విమానం ఎక్కారు. పదవ తరగతిలో ఉత్తమ మార్కులు సాధిస్తే విమానం ఎక్కిస్తామని, గతంలో ఇచ్చిన హామీని నల్లపురెడ్డిపల్లెకు చెందిన దాతలు నిలబెట్టుకున్నారు. పాఠశాలకు చెందిన 12మంది విద్యార్థులను అమరావతికి తీసుకెళ్లినట్లు పాఠశాల హెచ్‌ఎం రవీంద్రారెడ్డి తెలిపారు. విమాన ప్రయాణం చేయడం తమ జీవితంలో మరుపురాని అనుభూతిని ఇచ్చిందని విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు.
కడప ఎడ్యుకేషన్: జిల్లాలో సైన్సు కార్యకలాపాలను విస్తృతం చేయాలని జిల్లా విద్యాశాఖ అధి కారి షేక్ షంషుద్దీన్ సూచించారు. పెండ్లిమర్రి మండలం వెల్లటూరు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో ఫిజికల్ సైన్సు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న లేబాక బాలాజీని జిల్లా సైన్సు అధికారిగా జిల్లా విద్యాశాఖ అధికారి షేక్ షంషుద్దీన్ నియమించారు. ఈ మేరకు బుధవారం డీఈఓ కార్యాలయంలో బాలాజీకి నియామక ఉత్తర్వులను అందచేశారు. తనపై నమ్మకం ఉంచి జిల్లా సైన్సు అధికారిగా నియమించినందుకు లేబాక బాలాజీ డీఈఓకు కృతజ్ఞతలు తెలియ చేశారు. మాజీ జిల్లా సైన్సు అధికారి నిత్యానందరెడ్డి, సైన్సు ఉపాధ్యాయుడు గంగాధర్‌తోపాటు పలువురు సైన్సు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
వేంపల్లె/చక్రాయపేట/పెండ్లిమర్రి: పాఠశాలలో పునః ప్రారంభమయ్యే నాటికే స్మార్ట్ కిచెన్ షెడ్లను పూర్తి చేయాలని కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ పేర్కొన్నారు. బుధవారం ఆయన వేంపల్లె, చక్రాయపేట జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్మాణంలోని స్మార్ట్ కిచెన్ షెడ్ పనులను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 25 తేదీలోగా ఈ పనులను పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు ఆదేశించారు. సెంట్రలైజ్డ్ మోడల్ కిచెన్ నిర్మాణంలో అవసరమైన మార్పులు, చేర్పులపై ఇంజనీరింగ్ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. చక్రాయపేట జెడ్పీటీసీ శివప్రసాద్ రెడ్డి మండలంలో నెలకొన్న తాగునీటి సమస్య, ఉద్యాన పంటల సాగు చేసిన రైతుల కష్టాలు, తదితర వాటిని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.


