చక్రాయపేట: పవిత్ర పుణ్య క్షేత్రమైన గండి వీరాంజనేయ స్వామి నూతన ఆలయ మహాకుంభాభిషేక మహోత్సవాలు బుధవారంతో అత్యంత వైభవంగా ముగిశాయి. సుమారు ఆరు రోజులపాటు నిర్విఘ్నంగా పలు హోమాలు నిర్వహించి వేడుకలను ముగించారు. చివరి రోజు శ్రీమద్రామాయణ పట్టాభిషేకం,మహపూర్ణాహుతి,దక్షిన రాజగోపుర విమా ణ కలిశాలు, దీపస్తంభ కలశం తదితర కార్యక్ర మాలను నిర్వహించారు. అనంతరం భక్తులకు మూలవిరాట్ దర్శనం కల్పించారు, అహోబిల పీఠం నుంచి ప్రధాన అర్చకుడు రమేష్ చేతుల మీదుగా శ్రీకార్యం, పుష్పగిరి పీఠాధిపతి విద్యాశంకర భారతి స్వామిలచే విమాన కలశ స్థాపన, భూమానందాశ్రమ పీఠాధిపతి మాతాజి ప్రతిభానందగిరి ఉత్తరాధికారి ప్రణవానంద స్వామి చేతుల మీదుగా ఈకార్యక్రమం జరిగింది. ఆలయ కార్యనిర్వహణాధికారి గురుప్రసాద్, చైర్మన్ వెంకటస్వామి ఆధ్వర్యంలో టీటీడీ ఆగమ శాస్త్ర సలహాదారులు రాజేష్ స్వామి, విజయ్ స్వామిల శిష్య బృందం ఆలయ అర్చకులు కేసరి, రాజారమేష్, రాజగోపాలాచార్యులు, రామమోహన్శర్మ పర్యవేక్షణలో ఈకార్యక్రమాలు జరిగాయి.
చాలా రోజుల తర్వాత..
వీరాంజనేయ స్వామి మూల విరాట్ దర్శనం భక్తులకు సరిగ్గా నాలుగేండ్ల,ఆరు మాసాల ,పదిహేడు రోజులకు లభించింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆలయ పునర్నిర్మాణానికి రూ.28.5 కోట్లు మంజూరు కావడంతో 2021లో పలు యజ్ఙ యాగాదులు నిర్వహించి బాలాలయంలో దారువుతో చేసిన స్వామి వారి ఽప్రతిమకు జీవం పోసి అక్కడ భక్తులకు దర్శన వసతిని కల్పించి ప్రధాన ఆలయాన్ని మూసి పగులగొట్టారు. అప్పటి నుంచి భక్తులకు మూల విరాట్ దర్శనం కరువైంది. తిరిగి బుధవారంతో భక్తులకు స్వామి మూలవిరాట్ దర్శనం లభించింది.
హాజరైన కలెక్టర్,కమిషనర్
మహాకుంభాభి వేడుకలకు కలెక్టర్ చెరుకూరు శ్రీధర్, దేవదాయ ధర్మదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ హాజరయ్యారు. ఈసందర్భగా ఆలయ అర్చకులు వారికి పూర్ణఫలంతో స్వాగతించి తీర్థప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో డీఆర్డీఏ,డ్వామా పీడీలు రాజ్యలక్ష్మి,ఆదిశేషారెడ్డి,ఆర్‌డబ్ల్యూస్ ఎస్ఈ ఏడుకొండలు.ఈఈ శ్రీనివాసులు,ఏఈ రమేష్‌రెడ్డి,దేవదాయశాఖ ఎస్ఈ సతీష్ జిల్లా సహాయ కమీషనర్ శంకర్ పాల్గొన్నారు.
నాలుగేండ్ల ఆరు మాసాలపదిహేడు రోజుల తర్వాత భక్తులకు మూల విరాట్ దర్శనం
తన్మయత్వంతో పరవశించిన భక్తులు
హాజరైన పీఠాధిపతులు. కలెక్టర్ తదితరులు


