అడ్మిషన్‌.. టెన్షన్‌ | - | Sakshi
Sakshi News home page

అడ్మిషన్‌.. టెన్షన్‌

May 14 2026 1:01 AM | Updated on May 14 2026 1:01 AM

సాక్షి అన్నమయ్య: ప్రైవేటు టీచర్లకు అడ్మిషన్ల అగ చాట్లు తప్పడం లేదు. అసలే మండే ఎండలకు తోడు ఉక్కపోతతో అల్లాడుతుంటే.. అడ్మిషన్ల టార్గెట్లు వారిలో మరింత వేడి పుట్టిస్తోంది. కొన్ని ప్రైవేటు యాజమాన్యాలు టార్గెట్లు పెట్టి వీధుల్లో పరుగెత్తిస్తుంటే... మరికొన్ని పాఠశాలల యాజమాన్యాలు బస్సుల్లో టీచర్లకు పల్లెలకు తీసుకెళ్లి కరపత్రాల ద్వారా ప్రచారం చేయడంతోపాటు అడ్మిషన్లు చేయించేలా ఒత్తిళ్లు పెడుతున్నారు. లేకపోతే ఈ ఏడాది జూన్‌లో ప్రారంభమయ్యే కొత్త విద్యా సంవత్సరానికి సంబంధించి ఉపాధ్యాయ పోస్టుకు రెన్యూవల్‌ ఉండదని భయపెట్టిస్తున్నారు. సాధారణంగా వేసవి సెలవుల్లో విహార యాత్రలకు కుటుంబ సభ్యులతో వెళ్లి ఎంజాయ్‌ చేయాల్సిన సమయంలో... పల్లెలు, పట్టణాల్లో తిరగాల్సి వస్తోందని ప్రైవేటు టీచర్లు వాపోతున్నారు. అన్నమయ్య జిల్లాతోపాటు వైఎస్సార్‌ జిల్లాలో దాదాపు వెయ్యికి పైగా ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. ఇందులో కొన్ని ప్రైవేటు యాజమాన్యాలు ఉపాధ్యాయులపై టార్గెట్లు విధిస్తున్నారు. ఒక్కో ఉపాధ్యాయుడికి 10–15 అడ్మిషన్లు చేయించాలని తీవ్రమైన ఒత్తిడి చేస్తున్నారు.

ఇది తగునా!

సమాజంలో ఉపాధ్యాయులకు ప్రత్యేక స్థానం ఉంది. తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువుదే. అలాంటి ఉపాధ్యాయులను వీధుల్లోకి పంపి అడ్మిషన్లకోసం ఇబ్బందులు పెట్టడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ప్రైవేటు పాఠశాలల మధ్య పోటీతత్వం పెరగడంతో విద్యార్థుల సంఖ్యను పెంచుకునేందుకు ఎవరివారు తాపత్రయ పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మధ్యలో ప్రైవేటు ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అడ్మిషన్లు చేయకపోతే ఉద్యోగం రెన్యూవల్‌ ఉండదన్న ఆందోళన ఉపాధ్యాయుల్లో వెంటాడుతోంది.

ప్రైవేటు పాఠశాలల టీచర్లకు టార్గెట్ల తిప్పలు

ఒక్కొక్కరికి 10–15 అడ్మిషన్లు అంటూ ఒత్తిడి

రెన్యూవల్‌ ఉండదేమోనన్న భయంతో టీచర్ల పరుగులు

Advertisement
 
Advertisement
Advertisement