కడప సెవెన్‌రోడ్స్: జిల్లాలో ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలను సజావుగా, ప్రశాంతంగా పకడ్బందీగా నిర్వహించాలని డీఆర్వో మల్లికార్జునుడు సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని డీఆర్‌ఓ చాంబర్‌లో ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో జిల్లా పరీక్షల నిర్వహణ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు నిర్ణయించిన షెడ్యూలు ప్రకారం ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ సంవత్సరం కోర్సులకు సంబంధించి మే 21వ తేదీ నుంచి జూన్ 4 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆయా తేదీల్లో మొదటి సంవత్సర విద్యార్థులకు ఉదయం 9 నుంచి 12 వరకు, రెండవ సంవత్సర విద్యార్థులకు మధ్యాహ్నం 2.30 నుండి 5.30 వరకు పరీక్షలను నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లాలో మొత్తం 46 కేంద్రాల్లో పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేయడం జరిగిందన్నారు. ఆయా కేంద్రాల వద్ద గట్టి బందోబస్త్ ఏర్పాటు చేయాలనీ పోలీస్, రెవిన్యూ అధికారులకు సూచించారు. విద్యార్థులు సహాయం కొరకు కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ 08562 244171 కు ఫోన్ చేయవచ్చన్నారు.
డీఆర్వో మల్లికార్జునుడు


