కడప సెవెన్‌రోడ్స్: పదకవితా పితామహులు అన్నమాచార్యుల 618వ జయంతిని పురస్కరించుకుని కడప నగరం దొంగలచెరువులోని శ్రీ కోదండ రామాలయంలో సంకీర్తన పోటీలు గురువారం నిర్వహించారు. ఉదయం 9 గంటలకు నిర్వహించిన పోటీల్లో పలువురు విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం పోటీల్లో విజేతలైన వారికి బహుమతి ప్రదానం, సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఆలయ ధర్మకర్త దేసు వెంకటరెడ్డి, చలమారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కడప సిటీ: వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవిక మిషన్ గ్రామీణ–2025 (వీబీజీ రామ్‌జీ) పథకం అమలు మరోనెల రోజులపాటు వాయిదా పడింది. ఇప్పటివరకు ఉపాధి హామీ కార్యాలయాలకు ఎటువంటి సర్క్యులర్ రాకపోవడంతో పథకం వాయిదా పడినట్లు అధికారులు అభిప్రాయం వ్యక్తం చేశారు. మార్చి 31 నాటికి ఉపాధి హామీ ఆర్థిక సంవత్సరం పూర్తి కావాల్సి ఉంటుంది. ఏప్రిల్ 1 నుంచి వీబీజీ రామ్‌జీ కొత్త పథకం అమలు కావాల్సి ఉండగా, విధి విధానాలు ఖరారు కాకపోవడంతో మే 1వ తేదికి వాయిదా వేశారు.
కడప వైఎస్‌ఆర్ సర్కిల్: నగర శివార్లలోని యోగివేమన యూనివర్శిటీ క్రీడా మైదానంలో జరిగిన జిల్లాస్థాయి బాలబాలికల బీచ్ కబడ్డీ ఎంపికలు ఉత్సాహంగా జరిగినట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ వెంకట సుబ్బయ్య పేర్కొన్నారు. జిల్లాస్థాయిలో ఎంపికై న జట్టు ఈ నెల 7 నుంచి 10 వరకు నెల్లూరు జిల్లా సంగం మండలంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందని వివరించారు.
బాలుర జట్టు
వేణు, సాయి, బ్రహ్మయ్య, నూర్‌బాషా, మల్లికార్జున, పవన్, యశ్వంత్.
బాలికల జట్టు......
జోష్న, నీలిమ, మహేశ్వరి, షమీన, రేణుక, మేఘన, ఉష, ఐశ్వర్య
ప్రొద్దుటూరు కల్చరల్: స్థానిక అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూల్ మైదానంలో బాషా అథ్లెటిక్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి సీనియర్ విభాగంలో సీ్త్ర, పురుషులకు అథ్లెటిక్స్ పోటీలు ఉత్సాహంగా సాగాయి. ఈ పోటీల్లో 70 మంది క్రీడాకారులు ఉత్సాహంగా ఈ పోటీల్లో పాల్గొని తమ క్రీడా నైపుణ్యంతో అందరినీ ఆకట్టుకున్నారు. 100మీ, 200మీ, 400మీ, 800మీ, 1500మీ, లాంగ్‌జంప్, హైజంప్, షార్ట్‌పుట్, డిస్కస్‌త్రో, విభాగాల్లో పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ప్రతిభ కనపరచిన గాయత్రి, రెడ్డి కీర్తన, మానస, ప్రీతి, గవ్యశ్రీ, నాగరోహిణి, అఖిల, వరప్రసాద్, భాస్కర్, దుర్గా హర్షవర్దన్, షాహిద్, మహేష్, విష్ణువర్దన్‌రెడ్డిలు మే 4, 5 తేదీల్లో గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరుగనున్న ఏపీ స్టేట్ సీనియర్ అథ్లెటిక్ పోటీల్లో పాల్గొననున్నారు.
కడప ఎడ్యుకేషన్: యోగివేమన విశ్వవిద్యాలయం పోస్ట్ గ్రాడ్యుయేషన్ నాలుగో సెమిస్టర్ పరీక్షలను విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ ఆకస్మికంగా గురువారం తనిఖీ చేశారు. కడపలోని యోగి వేమన విశ్వవిద్యాలయం, ప్రొద్దుటూరు ఎస్సీఎన్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కేంద్రాలుగా విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. విశ్వవిద్యాలయంలో జరుగుతున్న పరీక్షా కేంద్రాన్ని విద్యార్థుల హల్ టికెట్‌లను వీసీ పరిశీలించారు. 694 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా నలుగురు విద్యార్థులు గైర్హాజరయ్యారు. ప్రొద్దుటూరు ఎస్సీఎన్నార్ ప్రభుత్వ కళాశాలలో 67 మంది పరీక్షలకు హాజరు కాగా ముగ్గురు విద్యార్థులు గైర్హాజరు అయ్యారని పరీక్షల కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ కె.ఎస్.వి కృష్ణారావు తెలిపారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వీసీ పరీక్షల అధికారులకు సూచించారు.


