కడప వైఎస్‌ఆర్ సర్కిల్: గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక సమస్యలు పరిష్కారానికి జిల్లా పరిషత్ కృషి చేయకపోతే ప్రజాక్షేత్రంలో ఉద్యమం తప్పదని సీపీఐ జిల్లా కార్యదర్శి చంద్ర పేర్కొన్నారు. శనివారం కడపలోని జిల్లా పరిషత్ కార్యాలయం ఎదుట ప్రజా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అందోళన చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల మౌలిక సదుపాయాల కల్పన కోసం 15వ ఫైనాన్స్ నిధులతోపాటు ప్రభుత్వం నుంచి వస్తున్న నిధులు, వాణిజ్య సముదాయాల నుంచి వస్తున్న ఆదాయం సమస్యల పరిష్కారానికి ఖర్చు చేయాల్సిన జిల్లా పరిషత్ లెక్కల ప్రకారం కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెబుతున్నప్పటికీ ఆచరణలో ఖర్చుకు తగ్గట్టు ప్రజల అవసరాలు తీర్చడంలో విఫలం అవుతుందన్నారు. వేసవి ఆరంభంలోనే తాగునీటి ఎద్దడితో గ్రామాలు విలవిలాడుతున్నాయని, బోర్లు, మోటార్ల రిపేర్లు, రక్షిత మంచినీటి పథకాల పేరుతో పాలకవర్గానికి, అధికారులకు ఆదాయాన్ని సమకూర్చిపెట్టే వనరులుగా మార్చుకొని ప్రభుత్వ ధనాన్ని కొల్లగొడుతున్నారని ఆరోపించారు.జిల్లా పరిషత్‌లో జరుగుతున్న అక్రమ నియామకాలపై, ప్రమోషన్లు, బదిలీలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వి వీరశేఖర్ ఎంవీ సుబ్బారెడ్డి జి వేణుగోపాల్ కేసి బాదుల్లా పి శ్రీరాములు పి బాలు,పి మస్తాన్, జి నాగేశ్వరరావు, షావల్లి, కే మునయ్య, ఇమ్మానియేల్, పడిగే వెంకట రమణ, లింగన్న, రవికుమార్, పి నాగరాజు, సుబ్బరాయుడు, తారక్ నరసింహ తదితరులు పాల్గొన్నారు.


