రాజంపేట : భద్రాచలం తరహాలో ఒంటిమిట్ట రైల్వేస్టేషన్‌ను అభివృద్ధి చేయాలని డీఆర్‌ఎం చంద్రశేఖర్‌గుప్తాను కోరినట్లు గుంతకల్ డివిజనల్ రైల్వే యూజర్స్ కమిటీ సభ్యుడు తల్లెం భరత్‌కుమార్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఒంటిమిట్టకు విచ్చేసిన డీఆర్‌ఎంతో ఆయన రైల్వేస్టేషన్‌లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒంటిమిట్ట స్టేషన్ అభివృద్ధితోపాటు ప్రయాణికులకు సౌకర్యాలను కల్పించే దిశగా నిర్ణయాలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారిక రామాలయంగా గుర్తింపు పొందడంతో.. రాష్ట్రంలోని నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు వస్తున్నారన్నారు. వీరందరికీ కూడా రైలు ద్వారా ఒంటిమిట్ట చేరుకునే పరిస్థితులు లేవన్నారు. అటు కడప, ఇటు నందలూరులో దిగి ఒంటిమిట్టకు చేరుకుంటున్నారన్నారు. ముంబై–చైన్నె రైల్వేమార్గంలో ప్రధాన పుణ్యక్షేత్రమైన ఒంటిమిట్ట రైల్వేస్టేషన్లలో ముందుగా కొన్ని రైళ్లకు అయినా హాల్టింగ్ ఇవ్వాలన్నారు. ముఖ్యంగా వెంకటాద్రి, రాయలసీమ, హరిప్రియ, చైన్నె రైళ్లకు హాల్టింగ్ ఇవ్వాలన్నారు. అలాగే స్టేషన్‌లో రెండు ప్లాట్‌ఫాంల మధ్య ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మితం చేయాలని కోరారు. తాగునీటి సౌకర్యాలు, రెండు ప్లాట్‌పాంలలో పై కప్పులు వేయాలన్నారు. అలాగే ఒంటిమిట్టకు వచ్చే యాత్రికులకు రెస్ట్ రూంలు, వేచివుండే గదులు, మరుగుదొడ్లు నిర్మించాలని కోరారు. ఇప్పటికే ఒంటిమిట్ట రైల్వేస్టేషన్ అభివృద్ధి విషయంలో ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డిలు రైల్వేమంత్రి (మినిస్టర్ ఆఫ్ రైల్వేస్)కు వినతులు ఇచ్చారన్నారు. రైళ్లకు స్టాపేజి ఇవ్వడం వల్ల రాష్ట్రంలోని నలుమూలల నుంచి వచ్చే యాత్రికులు, భక్తులకు రైలుసౌకర్యం కల్పించినట్లవుతుందని ఎంపీలు ఇప్పటికే రైల్వేశాఖకు తెలియచేశారని గుర్తు చేశారు. డీఆర్‌ఎం కూడా సానుకూలంగా స్పందించారని తెలిపారు. డీఆర్‌ఎంతో పాటు గుంతకల్ రైల్వే డివిజన్ అధికారులు, స్థానిక రైల్వే అధికారులు పాల్గొన్నారు. డీఆర్‌ఎం వెంట ఏడీఆర్‌ఎం సుదర్శన్‌రెడ్డి, అసిస్టెంట్ కమిషనరు రాజగోపాల్‌రెడ్డి, సీసీఐ జనార్ధన్, ఆర్‌పీఎఫ్ సీఐ కోటేశ్వరరావు, ఎస్‌ఐ వనిత, జీఆర్‌పీ అధికారి సునీల్‌రెడ్డి, గల్లా శ్రీను, శివకుమార్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
ఇప్పటికే ఎంఆర్‌కు
ఎంపీలు వినతులు
ఒంటిమిట్ట రైల్వేస్టేషన్‌లో
డీఆర్‌ఎంతో భేటీ
గుంతకల్ డీఆర్‌యూసీసీ సభ్యుడు తల్లెం భరత్‌రెడ్డి


