చక్రాయపేట : గండి వీరాంజనేయస్వామి సన్నిధిలో శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా స్వామి వారి గ్రామోత్సవం వైభవంగా నిర్వహించారు. పండుగ సందర్భంగా భక్తులు ఉదయం నుంచి అధిక సంఖ్యలో వచ్చి భక్తి ప్రపత్తులతో స్వామిని దర్శించుకున్నారు. సాయంత్రం ప్రత్యేకంగా అలంకరించిన ఉష్ట్ర వాహనంపై స్వామి ఉత్సవ విగ్రహం ఉంచి గండి పురవీధులతోపాటు సమీపంలోని వీరన్నగట్టుపల్లెలో స్వామి వారిని ఊరేగించారు.
గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
చింతకొమ్మదిన్నె : చింతకొమ్మదిన్నె పరిధిలోని రింగురోడ్డుపై జయరాజ గార్డెన్స్ సమీపంలో గురువారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొని భూమిరెడ్డి సూర్యనారాయణ(43) అనే వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు.. మైదుకూరు నివాసి సూర్యనారాయణ తన కుమారుడు వెంకన్నారాయణను చైతన్య పాఠశాలలో వదిలేందుకు మైదుకూరు నుంచి కడపకు వస్తుండగా జయరాజా గార్డెన్స్ సమీపంలో వారి బైక్‌ను గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో గాయపడ్డ తండ్రి కుమారులను వైద్య సేవల కోసం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. గురువారం అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో భూమిరెడ్డి సూర్యనారాయణ మృతి చెందాడని, వెంకట నారాయణ చికిత్స పొందుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలియజేశారు.
అశ్రునయనాలతో వీడ్కోలు
మైదుకూరు : భూమిరెడ్డి సూర్యనారాయణకు శుక్రవారం కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు అశ్రునయనాలతో కడపటి వీడ్కోలు పలికారు. విద్యార్థి దశ నుంచి మంచి క్రీడాకారుడిగా సూర్యనారాయణతో తమ అనుబంధాన్ని తలుచుకుని మిత్రులు కన్నీటి పర్యంతమయ్యారు. మైదుకూరులో క్రికెట్ టోర్నమెంట్ల నిర్వహణలో అతను చురుగ్గా ఉండేవాడని మైదుకూరు క్రికెట్ క్లబ్ సభ్యులు తెలిపారు.


