మాస్టర్‌ ప్లాన్‌కు మంగళం.. ముడుపులే ‘మూలం’ ! | - | Sakshi
Sakshi News home page

మాస్టర్‌ ప్లాన్‌కు మంగళం.. ముడుపులే ‘మూలం’ !

Mar 27 2026 8:54 AM | Updated on Mar 27 2026 8:54 AM

ప్రొద్దుటూరు రూరల్‌: నిబంధనలు నెమరువేయడానికి కాదు.. బుట్టదాఖలా చేయడానికే అన్నట్లుంది ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లె గ్రామ పంచాయతీ అధికారుల తీరు. అందినకాడికి ‘తడిపితే’ చాలు.. నిబంధనలను పాతరేసి, చెరువులు, కాలువలపై కూడా అపార్ట్‌మెంట్‌లు లేపేయవచ్చని అధికారులు నిరూపిస్తున్నారు. మైదుకూరు రోడ్డులో మాస్టర్‌ ప్లాన్‌ను తుంగలో తొక్కి, బఫర్‌ జోన్‌ను కబళిస్తూ సాగుతున్న ఓ అక్రమ అపార్ట్‌మెంట్‌ నిర్మాణం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

రూ. 20 లక్షల ‘ముడుపు’ మంత్రం!

ఈ అక్రమ కట్టడం వెనుక భారీ స్థాయిలో కాసుల వేట సాగినట్లు తెలుస్తోంది. తొలుత నిబంధనల ఉల్లంఘనను గుర్తించి పనులను నిలిపివేసిన అధికారులు, ఆ తర్వాత అధికార పార్టీకి చెందిన ఓ కీలక ప్రజాప్రతినిధి మధ్యవర్తిత్వంతో రూ. 20 లక్షల బేరం కుదుర్చుకున్నట్లు సమాచారం. ఈ ‘ముడుపుల’ మంత్రం పఠించిన వెంటనే, అక్రమ నిర్మాణానికి అధికారులు సాగిలపడి ‘గ్రీన్‌ సిగ్నల్‌’ ఇచ్చేశారు. డీఎల్పీఓ, డీపీఓ వంటి ఉన్నతాధికారులు నిత్యం ఈ ప్రాంతంలో సంచరిస్తున్నా, పన్నుల వసూళ్లపై ఉన్న శ్రద్ధ ఈ భారీ అక్రమ కట్టడంపై చూపకపోవడం వెనుక మతలబు ఏంటో అందరికీ అర్థమవుతూనే ఉంది.

కాలువ మలుపు.. పేదల పొట్ట కొట్టే తీర్పు!

అపార్ట్‌మెంట్‌ యజమాని ప్రయోజనాల కోసం రెవెన్యూ అధికారులు ఏకంగా మురికి కాలువ అలైన్‌మెంట్‌నే మార్చేయడం గమనార్హం. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ నుంచి వచ్చే ప్రధాన మురికి కాలువను అపార్ట్‌మెంట్‌కు తగలకుండా వంకర తిప్పారు. ఈ క్రమంలో పక్కనే ఉన్న సామాన్యుల, పేదల స్థలాలను కాలువలోకి నెట్టేశారు. అపార్ట్‌మెంట్‌ చుట్టూ ఫైర్‌ ఇంజిన్‌ తిరగడానికి కనీసం 2.5 మీటర్ల సెట్‌ బ్యాక్‌ కూడా వదలలేదు. రేపు ఏదైనా ప్రమాదం జరిగితే ఆ అపార్ట్‌మెంట్‌ వాసుల పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది.

పంచాయతీ కార్యదర్శి ‘అమాయకత్వం’!

ఈ అక్రమ దందాపై ‘సాక్షి’ వివరణ కోరగా, కొత్తపల్లె పంచాయతీ కార్యదర్శి నరసింహులు చెప్పిన సమాధానం విస్తుగొలుపుతోంది. గ్రామ పరిధిలో ఐదు అంతస్తుల భవనం లేస్తుంటే.. ‘నాకేమీ తెలియదు.. నా దగ్గర రికార్డులే లేవు’ అంటూ బుకాయించడం ఆయన బాధ్యతారాహిత్యానికి పరాకాష్ట. అధికారుల అండ, రాజకీయ అండదండలతో సాగుతున్న ఈ అవినీతి కట్టడంపై జిల్లా కలెక్టర్‌ తక్షణమే స్పందించి విచారణ జరిపించాలని బాధితులు కోరుతున్నారు.

కొత్తపల్లెలో కాలువను కమ్మేసిన

అపార్ట్‌మెంట్‌.. రూ. 20 లక్షల బేరంతో ‘గ్రీన్‌ సిగ్నల్‌’

బఫర్‌ జోన్‌లో అక్రమ నిర్మాణం..

చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న

ఉన్నతాధికారులు

ప్రజాప్రతినిధి, అధికారుల జేబుల్లోకి భారీగా అక్రమ వసూళ్లు

మురికి కాలువ అలైన్‌మెంట్‌ మార్పు.. పేదల స్థలాలకు ఎసరు

ఏమీ తెలియదంటున్న పంచాయతీ కార్యదర్శి.. రికార్డులే లేవని సమాధానం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement