గోపవరం : ఈత సరదా ఒకరి ప్రాణాలు తీసింది. ఈ విషాద ఘటన పెద్దగోపవరం ఎస్సీకాలనీలో గురువారం చోటుచేసుకుంది.వివరాలు మండలంలోని పెద్దగోపవరం ఎస్సీకాలనీకి చెందిన కత్తిమల్లేష్ (36) తోటివారితో కలిసి ఎస్సీకాలనీకి సమీపంలో ఉన్న బావి వద్దకు ఈతకు వెళ్లాడు. మల్లేష్ బావిలోకి దూకాడు. బావి లోపల తీగలు అల్లుకుపోయి ఉండటంతో వాటిల్లో ఇరుక్కుపోయాడు. ఎంతసేపటికి బయటికి రాకపోవడంతో అక్కడ ఉన్న వారు వెంటనే పోలీసు, అగ్నిమాపక కేంద్రానికి సమాచారమిచ్చారు. వారు హుటాహుటిన బావి వద్దకు చేరుకుని దాదాపు రెండు గంటల పాటు గాలించగా మల్లేష్ మృతదేహం లభ్యమైంది. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. సరదా కోసం ఈతకు వెళ్లి మృత్యువాతపడటంతో కుటుంబ సభ్యులు బోరుబోరున విలపించారు. ఎస్సీకాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బద్వేలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు బద్వేలు రూరల్ ఎస్‌ఐ రంగారావు కేసు నమోదు చేశారు.


