ప్రమాదంలో గాయపడిన యువకుడు మృతి | - | Sakshi
Sakshi News home page

ప్రమాదంలో గాయపడిన యువకుడు మృతి

Mar 27 2026 8:54 AM | Updated on Mar 27 2026 8:54 AM

మైదుకూరు : మైదుకూరు పట్టణ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి, చికిత్స పొందుతూ మొగిలిచర్ల భాను ప్రకాష్‌ (24) అనే యువకుడు గురువారం మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. దువ్వూరుకు చెందిన భానుప్రకాష్‌, ఎర్రగొల్ల గంగాప్రసాద్‌ అనే యువకులు బుధవారం బైక్‌పై కడపకు వెళుతున్నారు. మైదుకూరు శివారులోని చిత్తూరు – కర్నూలు జాతీయ రహదారి బైపాస్‌ సర్వీస్‌ రోడ్డు మలుపు వద్ద వ్యతిరేక దిశలో వస్తూ పాల వ్యాన్‌ బైక్‌ను ఢీకొంది. సంఘటనలో తీవ్రంగా గాయపడిన ఇద్దరిని చికిత్స కోసం కర్నూలుకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం భాను ప్రకాష్‌ మృతి చెందాడు. మెరుగైన చికిత్స కోసం గంగా ప్రసాద్‌ను హైదరాబాద్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు.

మెకానిక్‌ షెడ్‌లో

కాపర్‌ వైర్‌ చోరీ

పులివెందుల రూరల్‌ : స్థానిక కడప రోడ్డులో ఎమ్మార్‌ఎఫ్‌ షోరూం సమీపంలోని మెకానిక్‌ షెడ్‌లో గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు విద్యుత్‌ కేబుల్‌ను అపహరించారు. మెకానిక్‌ షెడ్డుకు సంబంధించిన గేట్‌ తాళాలను పగులగొట్టి అందులో రైతుకు సంబంధించిన కాపర్‌ వైరును దోచుకెళ్లారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 25కేజీల కాపర్‌ వైరును అపహరించుకపోయారని బాధితుడు లబోదిబోమంటున్నాడు. పోలీసు అధికారులు ప్రత్యేక దృష్టి సారించి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాడు

శివాలయంలో చోరీ

ఎర్రగుంట్ల: మండల కేంద్రమైన ఎర్రగుంట్ల పట్టణంలోని దొండపాడులో ఉన్న శివాలయంలో బుధవారం రాత్రి చోరీ జరిగింది. గురువారం ఉదయం భక్తులు గుడికి వెళ్లగా ఆలయం తలుపులు తెరిచి ఉన్నాయి. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటన స్థలాన చేరుకుని పరిశీలించారు. భక్తులు కానుకలు వేసిన హూండీని దొంగలు తీసుకెళ్లారు. ఆలయంలో ఉన్న సీసి పుటేజీ ఆధారంగా చోరీ జరిగినట్లు గుర్తించారు. ఈ విషయంపై ఆలయ ధర్మకర్త మలిశెట్టి చిన్నయ్య, దొండపాడు ప్రజలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ విశ్వనాథరెడ్డి తెలిపారు.

ద్విచక్రవాహనం దగ్ధం

సుండుపల్లె : మండల కేంద్రంలోని రెహమాన్‌వీధి బీఎస్‌ఎన్‌ఎల్‌ టవర్‌ వెనుక భాగంలోని మల్లినేని సుజాత ద్విచక్రవాహనాన్ని ఆమె ఇంటి ముందు భాగంలో పార్కింగ్‌ చేసింది. బుధవారం రాత్రి 2 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఏపీ03 సియూ 4770 నంబర్‌ గల ద్విచక్రవాహనానికి పెట్రోల్‌ పోసి నిప్పు పెట్టారు. బైక్‌ పూర్తిగా కాలిపోయింది. స్థానిక పోలీస్‌స్టేషన్లో గురువారం సుజాత పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement