హాయ్‌గా.. వేగంగా! | - | Sakshi
Sakshi News home page

హాయ్‌గా.. వేగంగా!

Mar 26 2026 7:45 AM | Updated on Mar 26 2026 7:45 AM

శరవేగంగా ‘గ్రీన్‌ఫీల్డ్‌’.. డిసెంబర్‌కే పూర్తి!

రూ.14 వేల కోట్లతో 343 కి.మీ. మేర ఆరు వరుసల రహదారి

కొడికొండ చెక్‌పోస్ట్‌ నుంచి విజయవాడ వరకు 14 ప్యాకేజీల్లో పనులు

ఇప్పటికే 60 శాతం పూర్తి..

రికార్డు వేగంతో సాగుతున్న నిర్మాణం

కడప సిటీ : రాష్ట్ర రవాణా ముఖచిత్రాన్ని మార్చేయనున్న ప్రతిష్టాత్మక ‘గ్రీన్‌ఫీల్డ్‌’ ఎక్స్‌ప్రెస్‌ హైవే పనులు శరవేగంగా సాగుతున్నాయి. నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో శ్రీ సత్యసాయి జిల్లా కొడికొండ చెక్‌పోస్ట్‌ నుంచి విజయవాడ వరకు చేపట్టిన ఈ ఆరు వరుసల రహదారి పనులు ఇప్పటికే 60 శాతం పూర్తయ్యాయి. సుమారు రూ. 14 వేల కోట్ల అంచనా వ్యయంతో 343 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టును ఈ ఏడాది డిసెంబరు చివరి నాటికి పూర్తి చేసి, జాతికి అంకితం చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

అసలేమిటీ ‘గ్రీన్‌ఫీల్డ్‌’..?

చాలామందికి గ్రీన్‌ఫీల్డ్‌ హైవే అంటే ఏమిటనే అవగాహన ఉండటం లేదు. సాధారణంగా ఉన్న రహదారులను వెడల్పు చేయడం కాకుండా, గ్రామాల మీదుగా వెళ్లకుండా నేరుగా పంటపొలాలు, ఖాళీ స్థలాల గుండా కొత్తగా నిర్మించే రహదారినే ‘గ్రీన్‌ఫీల్డ్‌ హైవే’ అంటారు. ఈ రోడ్డు నిర్మాణం ఎక్కడా గ్రామాల్లోకి వెళ్లదు. దీనివల్ల ప్రయాణ దూరం, సమయం భారీగా తగ్గుతాయి.

ఐదు జిల్లాల మీదుగా.. 14 ప్యాకేజీలు

ఈ మెగా ప్రాజెక్టు ఐదు జిల్లాల (శ్రీ సత్యసాయి, వైఎస్సార్‌ కడప, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల) గుండా సాగుతోంది. దీనికోసం ప్రభుత్వం ఇప్పటికే 6,902 ఎకరాల భూసేకరణ పూర్తి చేసింది. 2024 మార్చిలో ప్రారంభమైన ఈ పనులను మొత్తం 14 ప్యాకేజీలుగా విభజించి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నారు.

హైటెక్‌ భద్రత.. స్పీడ్‌ లిమిట్‌ 100 కేఎంపీహెచ్‌

ఈ హైవేపై గరిష్ట వేగ పరిమితిని గంటకు 100 కిలోమీటర్లుగా నిర్ణయించారు. కేవలం ఫోర్‌ వీలర్లకు మాత్రమే అనుమతి ఉంటుంది. భద్రతా కారణాల దృష్ట్యా ఆటోలు, ద్విచక్ర వాహనాలను నిషేధించారు. వేగ పరిమితిని పర్యవేక్షించేందుకు అత్యాధునిక ‘ఆటో సీసీ కెమెరాల’ను ఏర్పాటు చేస్తున్నారు. నిబంధనలు అతిక్రమిస్తే ఆటోమేటిక్‌గా వాహనదారుల మొబైల్‌కు చలాన్‌ మెసేజ్‌ వెళ్తుంది.

పనుల వేగానికి 4 గిన్నీస్‌ రికార్డులు

‘గ్రీన్‌ఫీల్డ్‌ హైవే పనులకు ఎటువంటి ఆటంకాలు లేవు. భూసేకరణ ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. అత్యంత నాణ్యతతో, వేగంగా పనులు చేస్తున్నందుకు గాను ఈ ప్రాజెక్టుకు ఇప్పటికే నాలుగు గిన్నీస్‌ వరల్డ్‌ రికార్డులు లభించాయి. డిసెంబరు చివరి నాటికి పనులు పూర్తి చేసి రహదారిని అందుబాటులోకి తెస్తాం.‘

– బి. అశోక్‌కుమార్‌, ఎన్‌హెచ్‌ఏఐ పీడీ, కడప

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement