డీసీఎంఎస్‌ అభివృద్ధికి కృషి | - | Sakshi
Sakshi News home page

డీసీఎంఎస్‌ అభివృద్ధికి కృషి

Mar 26 2026 7:45 AM | Updated on Mar 26 2026 7:45 AM

కడప అగ్రికల్చర్‌ : డీసీఎంఎస్‌ అభివృద్ధికి అందరి సహకారంతో కృషి చేస్తామని డీసీఎంఎస్‌ చైర్మన్‌ జయప్రకాష్‌ నారాయణబాబు పేర్కొన్నారు. కడపలో బుధవారం జరిగిన సర్వసభ్య సమావేశానికి జిల్లాలోని సహకార సంఘాల అధ్యక్షులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డీసీఎంఎస్‌ ఆధ్వరంలో నిర్వహించే షాపుల బాడుగలను పెంచనున్నట్లు చెప్పారు. అలాగే జిల్లాలోని అన్ని సహకారం సంఘాల ద్వారా ఎరువులు, విత్తనాలు పంపిణీ చేయాలన్నారు. దీంతోపాటు పంటలబీమాను గ్రామ యూనిట్‌ను అమలు చేసేందుకు సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేశారు. డీసీఓ వెంకటసుబ్బయ్య, మార్క్‌ఫెడ్‌ డీఎం పరిమళజ్యోతి, డీసీఎస్‌ఎం మేనేజర్‌ ఖాదర్‌వల్లి పాల్గొన్నారు.

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

పులివెందుల రూరల్‌ : స్థానిక ఉలిమెల్ల రింగ్‌ రోడ్డు సమీపంలో బుధవారం అనుమానస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల కథ నం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక సియోన్‌పురంలో నివాసం ఉంటున్న గంగా ప్రసాద్‌(32) బేల్దారి పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. బుధవారం ఉదయం ఉలిమెల్ల రింగ్‌ రోడ్డు సమీపంలో మృతదేహం పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గంగా ప్రసాద్‌ మృతికి గల కారణాలపై విచారణ చేపట్టారు. గంగా ప్రసాద్‌ డివైడర్‌ను ఢీకొని మృతి చెందాడా లేక ఏదైనా వాహనం ఢీకొందా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. మృతుడికి భార్య మమత, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

అరటి రైతును ఆదుకోవాలి: షర్మిల

కడప సెవెన్‌రోడ్స్‌ : అకాల వర్షాలు, ధరల పతనంతో నష్టపోయిన అరటి రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల డిమాండ్‌ చేశారు. బుధవారం కడపలో జాయింట్‌ కలెక్టర్‌ నిధి మీనాకు ఆమె వినతిపత్రం సమర్పించారు. అనంతరం షర్మిల మాట్లాడుతూ.. ఫిబ్రవరిలో టన్ను రూ. 26 వేలు పలికిన అరటి ధర, ప్రస్తుతం రూ. 6 వేలకు పడిపోవడం దారుణమన్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని రూ. 10–12 వేల మద్దతు ధరతో కొనుగోలు చేయాలని కోరారు. పులివెందుల ప్రాంతంలో జీ–9 రకం అరటి సాగు ఎక్కువగా ఉన్నందున, అక్కడ కోల్డ్‌ స్టోరేజ్‌, ప్రాసెసింగ్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయాలన్నారు. మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించడంతో పాటు, 2023–24 ఏడాదికి సంబంధించిన బీమా సొమ్మును తక్షణమే విడుదల చేయాలని ఆమె డిమాండ్‌ చేశారు.అంతకుముందు పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ను సందర్శించి, తన తండ్రి సమాధికి ఘనంగా నివాళులర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement