● వైఎస్సార్‌సీపీతోనే సంక్షేమ పాలన సాధ్యం
● మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా
కడప కార్పొరేషన్ : కూటమి ప్రభుత్వంలో క్రిస్టియన్ మైనార్టీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా విమర్శించారు. బుధవారం జిల్లా పార్టీ కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ క్రిస్టియన్ మైనార్టీ విభాగం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి క్రిస్టియన్ మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జాన్ వెస్లీతో పాటు అంజద్‌బాష ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ క్రిస్టియన్ మైనార్టీలకు మేలు జరిగిందంటే అది దివంగత వైఎస్సార్, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలోనేనని తెలిపారు. గత ప్రభుత్వంలో వీరి సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశపెట్టారని, కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ పథకాలేవీ అమలు కావడం లేదన్నారు. ప్రతి పాస్టర్‌కు గౌరవ వేతనం రూ.5వేలు ఇచ్చేవారని, జెరుసలేం పర్యటనకు ఆర్థిక సాయం చేసేవారన్నారు. ఇక ప్రభుత్వ పథకాలు వారికి అందేవన్నారు. ఈ ప్రభుత్వం క్రిస్టియన్ మైనార్టీలకు ఎలాంటి పథకాలు అందించకపోగా వారిపై దాడులు, దౌర్జన్యాలు చేస్తోందన్నారు. ఈ ప్రభుత్వ కుట్ర వల్లే ప్రవీణ్ పగడాల ఆకాల మరణం చెందారని ఆరోపించారు. క్రిస్టియన్ మైనార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జాన్ వెస్లీ మాట్లాడుతూ క్రిస్టియన్ మైనార్టీలను చైతన్య పరిచి కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను వివరించడానికి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నామని తెలిపారు. మాజీ మేయర్ పాకా సురేష్ కుమార్ మాట్లాడుతూ మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో క్రిస్టియన్ మైనార్టీలకు రక్షణ, భద్రత ఉండేదని, కూటమి ప్రభుత్వం వచ్చాక అవేవీ లేవన్నారు. వారికి అందిస్తున్న పథకాలు కూడా కోత కోశారన్నారు. అనంతరం క్రిస్టియన్ మైనార్టీలు మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, రాష్ట్ర అధ్యక్షులు జాన్ వెస్లీ, మాజీ మేయర్ పాకా సురేష్ కుమార్‌లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రిస్టియన్ మైనార్టీ విభాగం అధ్యక్షులు పాస్టర్ షెడ్రక్,నగర క్రిస్టియన్ మైనార్టీ విభాగం అధ్యక్షులు విజయ్ కిషోర్, రాష్ట్ర కార్యదర్శి ఫాస్టర్ జాన్, ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షులు సింగమాల వెంకటేశ్వర్లు, మాజీ అధ్యక్షులు సీహెచ్ వినోద్‌కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు బంగారు నాగయ్య యాదవ్ పాల్గొన్నారు.


