కడప అర్బన్ : కడప నగరం ఎరమ్రుక్కపల్లె సర్కిల్ సమీపంలోని ఓ వైన్ షాప్ వద్ద బుధవారం రాత్రి రవి,భాస్కర్ అనే యువకులపై కొందరు యువకులు కత్తులతో దాడి చేశారు. సమాచారం అందుకున్న వెంటనే సీఐ చిన్నపెద్దయ్య ఆధ్వర్యంలో వన్ టౌన్ ఎస్‌ఐ ప్రదీప్ కుమార్ సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకున్నారు. గాయపడిని యువకులను వైద్య పరీక్షల కోసం రిమ్స్‌కు తరలించారు. పోలీసు అధికారులు ఇచ్చిన ప్రాథమిక సమాచారం మేరకు కడపకు చెందిన త్రిపుర పాటి భాస్కర్, తన స్నేహితుడు రవి, స్నేహితులతో కలిసి మద్యం సేవించారు. వైన్ షాప్ నుంచి బయటికి రాగానే భాస్కర్,రవిలపై కొందరు కత్తులతో దాడి చేశారు.నిందితులు పరారీలో ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కారు, బైక్ ఢీ: వ్యక్తి మృతి
చింతకొమ్మదిన్నె : కడప–చిత్తూరు జాతీయ రహదారిపై చింతకొమ్మదిన్నె మండల పరిధిలోని జమాల్‌పల్లె గ్రామ సమీపంలో భారత్ పెట్రోల్ బంకు వద్ద కారు– బైకు ఢీకొన్న ప్రమాదంలో బైక్ రైడర్ వల్లెపు పెద్ద గంగయ్య (35) అక్కడికక్కడే మృతి చెందాడు. బుధవారం మధ్యాహ్నం రాయచోటి వైపు నుంచి వస్తున్న ఏపీ 39 జీవై 7389 నంరుగల కారు కడప నుంచి జమాలపల్లెకు వెళుతున్న ఏపీ 39 ఈడీ 6006 నంబర్‌గల బైక్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అలంఖానపల్లి గ్రామానికి చెందిన వల్లెపు పెద్ద గంగయ్య అక్కడికక్కడే మృతి చెందగా బైక్ సుమారు 45 అడుగుల దూరంలో పడిపోయింది. కారు కూడా అదుపుతప్పి పెట్రోల్ బంకు డివైడర్ గోడను ఢీకొని ఆగిపోయింది. కారు డ్రైవర్ పారిపోయినట్లు స్థానికులు తెలిపారు. కాగా మృతుడికి నాలుగు నెలల క్రితమే వివాహమైనట్లు తెలిసింది.
అరటి పంట దగ్ధం
కాశినాయన : మండలంలోని ఆకులనారాయణపల్లె గ్రామానికి చెందిన కర్ర రఘునాథ్ రెడ్డి అనే రైతుకు చెందిన రెండు ఎకరాల అరటి పంట బుధవారం దగ్ధమైంది. రైతు తెలిపిన వివరాల మేరకు.. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి రెండు ఎకరాల్లో అరటి పంట కాలిపోయిందన్నారు. దీంతో సుమారు రూ.2లక్షల మేర నష్టం వచ్చినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. పోరుమామిళ్ల అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా వారు వచ్చి మంటలను అదుపు చేశారు. ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతు రఘునాథ్ రెడ్డి కోరారు.


