కడప సెవెన్‌రోడ్స్: జిల్లాలో వంటగ్యాస్ సరఫరా అస్తవ్యస్తంగా మారింది. గ్యాస్ బుక్ చేసి రోజులు గడుస్తు న్నా సిలిండర్లు ఇంటికి చేరకపోవడంతో వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు. ఓ పక్క ఏజెన్సీ నిర్వాహకులు స్టాక్ లేదని చేతులెత్తేస్తుంటే, మరోపక్క జిల్లా అధికారులు మాత్రం గ్యాస్ కొరత లేదంటూ కలరింగ్ ఇస్తుండటం గమనార్హం.
ఏజెన్సీల చుట్టూ తిరుగుతున్నా ఫలితం సున్నా
కడప బీకేఎం వీధికి చెందిన వై.చాముండేశ్వరి ఈనెల 15న గ్యాస్ బుక్ చేయగా, 18న క్యాష్ మెమో కూడా వచ్చింది. 24 గంటల్లో సిలిండర్ వస్తుందని ఆశించినా ఫలితం లేదు. ప్రసాద్ గ్యాస్ ఏజెన్సీని సంప్రదిస్తే స్టాక్ తక్కువగా ఉందని, మరికొన్ని రోజులు ఆగాలని బదులిచ్చారు. అలాగే హబీబుల్లావీధికి చెందిన శివకుమార్ ఫోన్ పే ద్వారా డబ్బు చెల్లించినా, గరిశా ఏజెన్సీ నుంచి సిలిండర్ రాక అల్లాడుతున్నారు. ఇలా జిల్లావ్యాప్తంగా వందలాది మంది వినియోగదారులు ఏజెన్సీల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
అధికారుల బుజ్జగింపులు.. వాస్తవాలు వేరు
జిల్లాలోని 5.99 లక్షల గ్యాస్ కనెక్షన్లకు 58 ఏజెన్సీల ద్వారా సరఫరా జరుగుతోంది. సామాజిక మాధ్యమాల్లో వచ్చే ప్రచారాలు నమ్మవద్దని, తగిన నిల్వలు ఉన్నాయని అధికారులు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. ప్రస్తుతం ఆయిల్ కంపెనీల నుంచి సరఫరా సగానికి పడిపోయిందని ప్రసాద్ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు తేజ ‘సాక్షి’ ప్రతినిధికి వివరించారు. దీంతో వినియోగదారులకు సకాలంలో సిలిండర్లు అందించలేకపోతున్నామన్నారు.
యథేచ్ఛగా బ్లాక్ మార్కెటింగ్
జిల్లాలో ఎల్‌పీజీ సరఫరా అస్తవ్యస్తంగా మారిన తరుణంలో బ్లాక్ మార్కెట్ యథేచ్ఛగా సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం వంద శాతం గృహ అవసరాలకే గ్యాస్ అందించాలని స్పష్టం చేసింది. ఇందులో భాగంగా కమర్షియల్ గ్యాస్ సరఫరాను పూర్తిగా నిలిపివేసినా, క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది.
బడా హోటళ్లకు ‘అండ’.. చిన్నోళ్లపై ‘దండయాత్ర’
కమర్షియల్ సిలిండర్ల సరఫరా లేకపోయినా, నగరంలోని పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లు యథేచ్ఛగా నడుస్తున్నాయి. ఏజెన్సీల ద్వారా గృహ వినియోగ సిలిండర్లు భారీగా పక్కదారి పడుతుండటమే దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది. పౌరసరఫరాల అధికారులు, ప్రత్యేక బృందాలు ఈ అక్రమాలను అరికట్టడంలో పూర్తిగా విఫలమయ్యారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనధికార రీఫిల్లింగ్ కేంద్రాల్లో కిలో గ్యాస్ రూ. 300 వరకు విక్రయిస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు.
‘సాక్షి’ ప్రశ్నలకు డీఎస్‌ఓ మౌనం: జిల్లాలో అసలు గ్యాస్ నిల్వలు ఎంత ఉన్నాయి? కమర్షియల్ సరఫరా ఆగిపోయినా పెద్ద హోటళ్లు ఎలా నడుస్తున్నాయి? ఏజెన్సీలు సిలిండర్లను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్న ఆరోపణలపై చర్యలేవి? వంటి అంశాలపై ‘సాక్షి’ బుధవారం జిల్లా పౌరసరఫరాల అధి కారి రఘురామ్‌ను వివరణ కోరగా, ఆయన సమాధానం చెప్పకుండా దాటవేశారు. గ్యాస్ కష్టాలతో వినియోగదారులు అల్లాడుతుంటే, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న అధికారులు సమాధానం చెప్పకపోవడం శోచనీయం.
ఎల్‌పీజీ సరఫరాపై అధికారుల అబద్ధాలు
కొరత లేదంటూ మభ్యపెడుతున్న అధికారులు
సరఫరా సగం పడిపోయిందంటున్న నిర్వాహకులు
సిలిండర్లను పక్కదారి పట్టిస్తున్న ఏజెన్సీలు
గ్యాస్ అందక వినియోగదారుల తిప్పలు
ఎల్‌పీజీ లేక తిప్పలు
పది రోజుల క్రితం బుక్ చేశాను. ఓటీపీ కూడా వచ్చింది. కానీ సిలిండర్ రాలేదు. ఏజెన్సీకి వెళ్తే మరో 15–20 రోజులు ఆగాలని చెబుతున్నారు. గ్యాస్ లేక చాలా అవస్థలు పడుతున్నాం.
–జమీల,హబీబుల్లావీధి, కడప
డబ్బు చెల్లించినా ఫలితం లేదు
డెలివరీ బాయ్స్ చెబితే ఈనెల 14న ఫోన్–పే ద్వా రా రూ. 963 చెల్లించాను. అకౌంట్ నుంచి డబ్బు కట్ అయింది కానీ గ్యాస్ రాలేదు. ఏజెన్సీ వాళ్లేమో మరికొన్ని రోజులు ఆగమంటున్నారు.
–శివకుమార్, హబీబుల్లావీధి, కడప


