విధి నిర్వహణలో డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్‌ మృతి | - | Sakshi
Sakshi News home page

విధి నిర్వహణలో డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్‌ మృతి

Mar 25 2026 7:15 AM | Updated on Mar 25 2026 7:15 AM

ప్రొద్దుటూరు : విధి నిర్వహణలో ఉన్న డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్‌ సి.గురునాథ్‌ (58) గుండెపోటుతో మరణించాడు. ప్రొద్దుటూరు పట్టణంలోని ఎద్దుల వెంకటసుబ్బమ్మ మున్సిపల్‌ ఉన్నత పాఠశాలలో పదో తరగతి పరీక్షల్లో సెంటర్‌ ఏ డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న గురునాథ్‌ ఎప్పటిలాగే సోమవారం మధ్యాహ్నం పరీక్ష అనంతరం జవాబు పత్రాలను తీసుకుని ద్విచక్రవాహనంలో హెడ్‌ పోస్టాఫీసుకు బయల్దేరారు. మధ్యాహ్నం 1.15 గంటల ప్రాంతంలో సెంటర్‌ బీ ఇన్‌చార్జి కొండయ్యతో కలసి వెళుతుండగా గాంధీ రోడ్డులో అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. కిందపడిన ఆయనను వెంటనే స్థానిక ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించి ఇంజెక్షన్‌ వేసిన అనంతరం కడపకు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తీసుకెళుతుండగా అర్ధరాత్రి సమయంలో మార్గంమధ్యలో ఆయన మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈయనకు ఇద్దరు కుమార్తెలు, ఒకు కుమారుడు ఉన్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో క్రాఫ్‌ టీచర్‌గా పని చేస్తున్న ఈయనకు స్కూల్‌ అసిస్టెంట్‌గా పదోన్నతి లభించింది. గత ఏడాది జరిగిన బదిలీల్లో రాజుపాళెం మండలం పర్లపాడు హైస్కూల్‌లో సోషల్‌ అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. గురునాథ్‌ మృతి పట్ల ఉపాధ్యాయ సంఘాల నాయకులతోపాటు ఉపాధ్యాయులు సంతాపాన్ని తెలిపారు. విషయం తెలుసుకున్న డీఈఓ షంషుద్దీన్‌, ఎంఈఓలు సావిత్రమ్మ, శోభారాణి, పర్లపాడు హైస్కూల్‌ ప్రధానోపాధ్యాయుడు హనుమంతరెడ్డిలు గురునాథ్‌ మృతదేహాన్ని సందర్శించి నివాళి అర్పించారు.

జనగణనలో

ప్రమాణాలు పాటించాలి

కడప సెవెన్‌రోడ్స్‌ : సమాచారం సేకరణలో కచ్చితత్వం, ప్రమాణాలను పాటించే విధానాలపై దృష్టి సారించాలని జిల్లా రెవెన్యూ అధికారి, జిల్లా గణన అధికారి విశ్వేశ్వర నాయుడు తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌ హాలులో భారత సెన్సస్‌–2027 జనగణన కార్యక్రమ నిర్వహణకు సంబంధించి మూడవ స్థాయి శిక్షణలో భాగంగా ఫీల్డ్‌ ట్రైనర్లకు 2వ రోజు శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మే 1 నుంచి 30 వరకు జిల్లాలో జరగనున్న సర్వేకి సంబంధించి ఫీల్డ్‌ ట్రైనర్స్‌కు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. 2027 జనాభా గణన రెండు దశల్లో జరుగుతుందని తెలిపారు. మొదటి దశలో ఇళ్ల జాబితా, ఇళ్ల గణన, రెండవ దశలో జనాభా గణన నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. రెండవ దశలో కుల గణన కూడా చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జనాభా గణన జిల్లా ఇన్‌చార్జి, మాస్టర్‌ ట్రైనర్‌ మోహన్‌ రమణ, మాస్టర్‌ ట్రైనర్లు ప్రొఫెసర్లు శ్రీనివాసులు, సుదర్శన్‌రెడ్డి, ఆదిలక్ష్మి ఫీల్డ్‌ ట్రైనర్లకు శిక్షణ అందించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్‌ కిరణ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళనలు ఉధృతం

రాజంపేట టౌన్‌ : ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళనలను ఉధృతం చేయనున్నట్లు యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజ హెచ్చరించారు. సమస్యల పరిష్కారానికై స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట యూటీఎఫ్‌ నాయకులు మంగళవారం నిరాహార దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీరాజా పాల్గొని మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు అయినా పీఆర్‌సీ కమిషన్‌ను కూడా ఏర్పాటు చేయక పోవడం దారుణమన్నారు. పీఆర్‌సీ ఇవ్వడం ఆలస్యం అయ్యే పరిస్థితులు ఉన్నందున 29 శాతం మధ్యంతర భృతిని ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటి వరకు రావాల్సిన అన్ని డీఏలను వెంటనే ఇవ్వాలన్నారు. 2004కు ముందు ఉద్యోగంలో చేరిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని, సీపీఎస్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్‌ జిల్లా, డివిజన్‌ నాయకులు పి.వెంకటసుబ్బయ్య, సివి.రమణమూర్తి, కె.రమేష్‌జోషి, జి.నాగేంద్ర, కె.శివయ్య, ఎస్‌.వినోద్‌కుమార్‌, ఎ.చంద్రయ్య, కె.రామచంద్ర తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement