వెలవెలబోయిన షర్మిల పర్యటన | - | Sakshi
Sakshi News home page

వెలవెలబోయిన షర్మిల పర్యటన

Mar 25 2026 7:15 AM | Updated on Mar 25 2026 7:15 AM

పీసీసీ అధ్యక్షురాలి పర్యటనకు

జనస్పందన కరువు

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల మంగళవారం ఉమ్మడి కడప జిల్లాలో చేపట్టిన పర్యటన తుతూమంత్రంగా సాగింది. అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించేందుకు వచ్చిన ఆమె, రైతుల సమస్యల కంటే వైఎస్సార్‌సీపీపై విమర్శలు చేయడానికే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. పర్యటన ఆద్యంతం జనస్పందన కరువవ్వడమే కాకుండా, కాంగ్రెస్‌ పార్టీలోని ముఖ్య నేతలు కూడా గైర్హాజరు కావడం చర్చనీయాంశమైంది. పులివెందుల పర్యటనలో పీసీసీ అధికార ప్రతినిధి తులసిరెడ్డి, పీసీసీ డెలిగేట్‌ వేలూరు శ్రీనివాసరెడ్డి వంటి సీనియర్లు కనిపించకపోవడంతో పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. కనీసం వంద మంది కార్యకర్తలు కూడా లేకపోవడంతో షర్మిల నియోజకవర్గ ఇన్‌ఛార్జి ధృవకుమార్‌రెడ్డిపై తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. జన సమీకరణ కోసం మహిళలకు రూ. 500 కూలీ ఇచ్చి పిలిపించినా ఫలితం లేకపోయింది. ఈ పర్యటనలో కేవలం జిల్లా అధ్యక్షురాలు విజయజ్యోతి, కొందరు నియోజకవర్గ ఇన్‌చార్జిలు మాత్రమే పాల్గొన్నారు.

బనానా ప్యాక్‌ హౌస్‌పై అసత్యాలు

పులివెందుల ప్రాంత అరటి రైతుల కోసం గత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం రూ. 25 కోట్లతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ‘బనానా ఇంటిగ్రేటెడ్‌ ప్యాక్‌ హౌస్‌’పై షర్మిల అబద్ధాలు వల్లించారు. 2024 మార్చి 11న జగన్‌ దీనిని ప్రారంభించగా, ప్రస్తుత కూటమి ప్రభుత్వం దీనిని పట్టించుకోకపోవడంతో నిరుపయోగంగా మారింది. అయితే, అసలు జగన్‌ హయాంలో దీనిని నిర్మించలేదంటూ షర్మిల మాట్లాడటంపై స్థానిక రైతులు మండిపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement