కేసీ పంట.. పండేదెట్టా ! | - | Sakshi
Sakshi News home page

కేసీ పంట.. పండేదెట్టా !

Mar 24 2026 7:57 AM | Updated on Mar 24 2026 7:57 AM

మార్చి చివరి వరకు నీటి విడుదలకు అవకాశం

నీటిని నిలిపేస్తే తీవ్రంగా నష్టపోతాం

చాపాడు : కేసీ కెనాల్‌ ఆయకట్టు పంటలపై ప్రమాద ఘంటిక మోగుతోంది. ఆయకట్టు పొలాలకు సాగునీటిని ఎంత వరకు విడుదల చేసేది స్పష్టమైన హామీ లేకపోవడంతో రైతుల్లో సందిగ్ధత నెలకొంది. ఖరీఫ్‌ సీజన్‌లో వరి పంట తర్వాత మార్చి చివరి వరకు నీటిని విడుదల చేస్తామని అధికారులు ప్రకటించారు. ఆ సమయంలో సాగునీరు వస్తుందనే ఆశాభావంతో ఆరుతడి పంటలతోపాటు అధికశాతం మంది రైతులు రెండో కారుగా వరి పంట సాగు చేశారు. అప్పటికే కేసీ కెనాల్‌లో ఖరీఫ్‌ సీజన్‌లో మాదిరి నీరు పారుతుండటంతో రైతులు సాగు నీటి కొరత రాదనే ఆశతో వరి సాగుపై దృష్టి సారించారు. పంట కాలం పూర్తవ్వాలంటే మరో నెల రోజుపాటు వరి పైరుకు సాగు నీరు అవసరం ఉంది. వారం రోజుల నుంచి తక్కువ పరిమాణంలో సాగు నీరు ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతంలో నీటి ప్రవాహం తగ్గడం, రాజోలి ఆనకట్ట వద్ద సాగునీరు అందించే కుందూనదిలో నీరు తగ్గిపోవడంతో కేసీ ప్రదాన కాలువలో గణనీయంగా నీరు తగ్గిపోయింది. దీంతో రైతులు సాగు నీటి కోసం ఇబ్బందు లు పడుతున్నారు. మండల పరిధిలో 12వేల ఎకరా ల్లో నూగు, పెసర, మినుము, వేరుశనగ ఇంతర పంటలు సాగులో ఉండగా అధిక భాగంలో వరి పంట సాగు చేశారు. వరి పంటకు ఏప్రిల్‌ చివరి వరకు నీరు విడుదలైతే తప్ప పంటలు పూర్తయ్యే పరిస్థితి లేదు. కుందూ నదిలో ఇప్పటికే నీటి ప్రవాహం చాలా వరకు తగ్గుముఖం పట్టింది. దీంతో వరి పంటలను సాగు చేసిన రైతులు ఆందోళన చెందుతున్నారు. మార్చి చివరి వరకు నీటి విడుదలకు కృషి చేస్తామని కేసీ అధికారులు, పాలకులు చెబుతున్నారు. రైతులు మాత్రం ఏప్రిల్‌ చివరి వరకు నీటిని విడుదల చేయాలని లేకుంటే సాగైన వరి పంటలు దెబ్బతింటాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుందూలో సాగునీటి ప్రవాహం పూర్తిగా తగ్గిపోయింది. తూముల ద్వారా కాలువలకు నీటిని అందించేందుకు సోమవారం కేసీ కెనాల్‌ డీఈ పుల్లయ్య, ఏఈలు జిలాని బాషా, సుబ్బరాయుడు, వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు సుబ్బన్న, దస్తగిరి, లస్కర్లు రాజోలి ఆనకట్ట వద్ద సాగు నీటిని కాలువలకు అందించేందుకు శ్రమించారు. ప్రస్తుతం కేసీ ప్రధాన కాలువలో 400 క్యూసెక్కులు, చాపాడు కాలువలో 120 క్యూసెక్కులు, కుందూనదిలో 30 క్యూసెక్కులు మాత్రమే నీరు ప్రవహిస్తోంది. దీంతో విడతల వారీగా సాగునీరు ఇచ్చే ఆలోచనలో అధికారులు ఉన్నారు.

● కేసీ కెనాల్‌లో నీటి ప్రవాహం తగ్గుదలపై కేసీ కెనాల్‌ డీఈ పుల్లయ్య మాట్లాడుతూ.. ఉన్నతాధికారుల సూచనల మేరకు ఆరుతడి పంటలకు మార్చి చివరి వరకు సాగు నీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. వరి అధికంగా సాగు చేయడంతో నీటి కొరత ఏర్పడిందని తెలిపారు.

కేసీ ప్రధాన కాలువలో అడుగంటిన నీటి ప్రవాహం

కేసీ ఆయకట్టు పరిధిలో సాగులో ఉన్న వరి పైరు

కేసీ కాలువల్లో ఆగిన నీరు..

రైతుల్లో ఆందోళన

సాగులో వరి, ఇతర ఆరుతడి పంటలు

మార్చి నెలాఖరుకే సాగు నీరంటున్న అధికారులు, పాలకులు

ఎగువ ప్రాంతాల్లో నీటి ప్రవాహం క్రమంగా తగ్గడంతో కేసీ కాలువకు నీరు పూర్తిగా తగ్గింది. రాజోలి ఆనకట్ట నుంచి నీటి సరఫరాకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. మార్చి చివరి వరకు కాలువకు నీటిని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కేసీ కాలువలో విడతల వారీగా నీటి సరఫరా చేపట్టే అవకాశం ఉంది. కుందూలో కూడా నీటి ప్రవాహం తగ్గిపోగా ఎగువ ప్రాంతాల నుంచి నీటి విడుదలకు అధికారులతో చర్చిస్తున్నాం. వరి సాగు చేసిన రైతులు ఇతర నీటి వనరులు గుర్తించుకోవాలి.

– డి.గురివిరెడ్డి, కేసీ కెనాల్‌ ప్రాజెక్టు వైస్‌ చైర్మన్‌, లక్ష్మీపేట, చాపాడు మండలం

కేసీ కాలువకు నీటిని నిలిపేస్తే ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. 4 ఎకరాలు కౌలుకు తీసుకుని వరి పంట సాగు చేశాను. ప్రస్తుతం పంట వెన్నుదశలో ఉంది. 20 రోజులపాటు నీరు విడుదలైతే పంట చేతికొచ్చే అవకాశం ఉంటుంది. అధికారులు కేసీ కాలువకు ఏప్రిల్‌ వరకు నీటిని విడుదల చేయాలి.

– భాస్కర్‌రెడ్డి, రైతు, విశ్వనాథపురం, చాపాడు మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement