పులివెందుల టౌన్ : పట్టణంలోని స్థానిక హోటళ్లు, డాబాలపై సోమవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీ సుధీర్ తన సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ దాడులలో హోటళ్లు, డాబాలలో నిల్వ ఉంచుకున్న గృహ అవసరాలకు సంబంధించిన 56 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. పట్టణంలో గ్యాస్ సిలిండర్ల కొరత ఎక్కువగా ఉండటంతో హోటళ్లు, డాబాలలో కమర్శియల్ సిలిండర్లు వాడుతున్నట్లు సమాచారం రావడంతో దాడులు నిర్వహించామని వెల్లడించారు. ఈ దాడులను వరుసగా కొనసాగిస్తామని హోటల్లో వంట గ్యాస్ సిలిండర్లు ఉపయోగిస్తే కఠిన చర్యలు తప్పవని హోటళ్ల యజమానులను హెచ్చరించారు. గ్యాస్ సిలిండర్ల పంపిణీ ఆలస్యంపై వివరణ కోరగా.. పులివెందులలో 2600మంది వినియోగదారులకు గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేయాల్సి ఉందన్నారు. ఈ విషయమై డిప్యూటీ కలెక్టర్, తహసీల్దార్‌లతో చర్చిస్తామన్నారు. గ్యాస్ సిలిండర్లు రాగానే అందరికి పంపిణీ చేస్తామని వివరించారు. కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
56 గ్యాస్ సిలిండర్ల పట్టివేత


