ఎర్రగుంట్ల : రైల్లో బంగారు ఆభరణాలు చోరీ చేస్తున్న అంతరాష్ట్ర దొంగ కోక్కోడస్ మహమ్మద్ సవాద్ (25)ను అరెస్టు చేసి అతని వద్ద నుంచి 7.5 తులాలు బంగారు నగలు, రెండు మొబైల్స్, రూ.1000 నగదును స్వాధీనం చేసుకున్నట్లు రైల్వే సీఐ సుధాకర్‌రెడ్డి తెలిపారు. సోమవారం యర్రగుంట్ల రైల్వేస్టేషన్‌లోని జీఆర్‌పీ స్టేషన్‌లో కేసు వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు మహిళలు, ప్రయాణికుల బంగారు నగలు, విలువైన వస్తువులను దోచుకోవడమే లక్ష్యంగా చోరులు రైల్లో ప్రయాణిస్తుంటారని పేర్కొన్నారు. ఈక్రమంలో ఈ నెల 19న గుంటూరు జిల్లా గుంటూరు టౌన్‌కు చెందిన గున్రెడ్డి జయశ్రీరెడ్డి కుటుంబ సభ్యులతో గుంటూరు నంచి తాడిపత్రికి ధర్మవరం రైలుల్లో వస్తుండగా చోరులు తన బ్యాగు, బంగారు నగలు దొంగలించారని ఫిర్యాదు ఇచ్చిందన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామన్నారు. ఈ నేపథ్యంలో సోమవారం యర్రగుంట్ల ౖరైల్వే స్టేషన్లోని రెండో ప్లాట్‌ఫారం మీద ఉన్న క్యాంటిన్ మధ్య ముద్దాయి మహమ్మద్ సవాద్‌ను అరెస్టు చేసినట్లు తెలిపారు. మరో ముగ్గురు దొంగలు పరారీలో ఉన్నారని తెలిపారు. ముద్దాయి కేరళం రాష్ట్రంలోని వయనాడు జిల్లా, పణమరం గ్రామస్తుడని తెలిపారు. ముద్దాయి వద్ద నుంచి 7.5 తులాలు బంగారుతో పాటు రెండు మొబైల్ ఫోన్లు, రూ.1000 నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. రైల్వే స్టేషన్లలో అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
వివరాలు వెల్లడించిన
రైల్వే సీఐ ఎం. సుధాకర్‌రెడ్డి


