నాగిరెడ్డిపల్లె వాసుల ధర్నా
కడప సెవెన్‌రోడ్స్ : తమ గ్రామ శ్మశానానికి వెళ్లే పాత రహదారిని తక్షణమే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ మైదుకూరు మండలం నాగిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన ప్రజలు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు డి.రెడ్డిబాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్మశానానికి వెళ్లే రహదారిని ఇటీవల కొంతమంది వ్యక్తులు ఆక్రమించి మూసి వేశారని ఆరోపించారు. సుమారు 20 ఏళ్లుగా గ్రామ ప్రజలు ఉపయోగిస్తున్న రహదారిని అకస్మాత్తుగా మూసివేయడంతో మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. స్మశానానికి సమీపంలో ఉన్న భూముల్లో డీకేటీ పట్టాలు ఎలా మంజూరు చేశారన్న విషయంపై గ్రామ ప్రజలకు అనేక అనుమానాలు ఉన్నాయని తెలిపారు. దీనిపై పూర్తి స్థాయి విచారణ నిర్వహించాలన్నారు. ముదిరాజ్ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వై.శివశంకర్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కె.రామాంజనేయులు, మహిళా అధ్యక్షురాలు రామలక్షుమ్మ, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు ఎన్.మణికుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం జేసీకి వినతిపత్రమిచ్చారు.


