ఎర్రచందనం దుంగల స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

ఎర్రచందనం దుంగల స్వాధీనం

Mar 23 2026 8:33 AM | Updated on Mar 23 2026 8:33 AM

ఖాజీపేట : 17 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకుని, 9 మందిని అరెస్ట్‌ చేశారు. ఖాజీపేట పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం విలేకరుల సమావేశంలో మైదుకూరు డీఎస్పీ రాజేంద్రప్రసాద్‌ వివరాలు వెల్లడించారు. నాగసానిపల్లె చిలకకనం పై భాగాన ఎర్రచందనం అక్రమ రవాణా జరుగుతోందన్న సమాచారం రావడంతో ఖాజీపేట సీఐ వంశీధర సిబ్బందితో వెళ్లి దాడులు నిర్వహించారని అన్నారు. అక్కడ తరలించేందుకు సిద్ధంగా ఉన్న 17 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారని అన్నారు. వీటి బరువు సుమారు 326.700 కేజీలుగా ఉందని అన్నారు. రవాణాకు సిద్ధంగా ఉన్న ఒక మినీ లారీ, ఆల్టో వాహనం, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. వీటి విలువ రూ.10 లక్షల 54 వేలు ఉంటుందని అన్నారు. అక్రమ రవాణా విషయంలో 9 మందిని అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు. అందులో తాడిపత్రికి చెందిన ప్రతాప్‌రెడ్డి, వనిపెంట గ్రామానికి చెందిన శేషు, చిత్తూరు జిల్లా వెదురుకుప్పంకు చెందిన బండి మహేంద్ర, తిరుపతికి చెందిన దండు కృపాకుమార్‌, తిరుపతి రూరల్‌ చెర్లోపల్లె గ్రామానికి చెందిన హరికృష్ణ, మంచిరెడ్డి శ్రీనివాసులరెడ్డి, తేజ, కానాల వరచంద్రకుమార్‌ ఉన్నారని పేర్కొన్నారు. పవన్‌, నక్కా చిన్న వెంకటసుబ్బయ్య, బెంగుళూరుకు చెందిన బామ్‌ పరారీలో ఉన్నారని అన్నారు. వీరిని త్వరలోనే అరెస్ట్‌ చేయడం జరుగుతుందని అన్నారు.

ముగ్గురు అరెస్ట్‌

కలికిరి : ఎర్రచందనం దుంగలు పోలీసులు స్వాధీనం చేసుకుని ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో సీఐ అనీల్‌కుమార్‌ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆదివారం మధ్యాహ్నం మండల పరిధిలోని మేడికుర్తి క్రాస్‌ వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. తమిళనాడు వాసులు ఒక ద్విచక్రవాహనంలో ముగ్గురు రావడంతో వారిని ఆపడంతో తడబడిన వాళ్లు పొంతన లేని సమాధానం చెప్పడంతో అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. తరలించడానికి ఎర్రచందనం దుంగలు సిద్ధంగా ఉన్నాయని, ముందుగా దారి చూస్తున్నట్లు వారు పేర్కొన్నారు. దీంతో మేడికుర్తి క్రాస్‌ సమీపాన నల్లగుట్ట వద్ద దాచిన నాలుగు ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని నిందితులపై కేసు నమోదు చేశారు. నిందితులు తమిళనాడు వేలూరు జిల్లా అన్నిగట్టు తాలూకా తొంగమలైకి చెందిన సోదరులు చంద్రన్‌, రామరాజు, సెంగాడకు చెందిన దొరస్వామిగా గుర్తించారు. వీరు ఎర్రచందనం కూలీలుగా విచారణలో తేలిందని సీఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement