ఆ పోలీస్‌ అధికారులపై చర్యలు చేపట్టేరా? | - | Sakshi
Sakshi News home page

ఆ పోలీస్‌ అధికారులపై చర్యలు చేపట్టేరా?

Mar 23 2026 8:33 AM | Updated on Mar 23 2026 8:33 AM

సాక్షి టాస్క్‌ఫోర్స్‌ : పులివెందుల సబ్‌ డివిజన్‌ అధికారితోపాటు మరో సీఐపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌ ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ చర్యలు చేపడతారా అని పలువురు చర్చించుకుంటున్నారు. వివరాలలోకి వెళితే.. గత నెల 25వ తేదీన పులివెందుల 4వ వార్డు వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్‌ పార్నపల్లె కిశోర్‌ ఫిర్యాదు నేపథ్యంలో జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) పులివెందుల సబ్‌ డివిజన్‌ అధికారితోపాటు మరో సీఐపై కేసు నమోదు చేసి నాలుగు వారాల్లోగా చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీని ఆదేశించింది. మరో మూడు రోజుల్లో గడువు ముగియనుండటంతో ఆ పోలీసు అధికారులపై జిల్లా ఎస్పీ ఎలాంటి చర్యలు చేపడుతారోనని వేచి చూస్తున్నారు. కౌన్సిలర్‌ కిశోర్‌తోపాటు గతేడాది పులివెందుల మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ వరప్రసాద్‌తోపాటు 13 మందిపై టీడీపీ నాయకుల ఒత్తిళ్ల మేరకు అప్పట్లో అక్రమ కేసు నమోదు చేయడం జరిగింది. అంతేకాక కిశోర్‌తోపాటు మరో ఐదుగురిపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారు. దీనిపై కిశోర్‌ జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే ఇందులో ఉన్న సీఐ స్థాయి అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడి రిమాండ్‌లో ఉండటం గమనార్హం. అక్రమ కేసు బనాయించిన ఆ అధికారులపై చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.

రోజూ రూ.కోట్లు చేతులు మారుతున్న వైనం

పులివెందుల నియోజకవర్గంలో యథేచ్ఛగా జూదాలు జరుగుతున్నాయి. టీడీపీ నాయకుల కనుసన్నల్లో జూద స్థావరాలు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలోని టీడీపీ నాయకుల స్వగ్రామంతోపాటు లింగాల మండలం, ఇతర ప్రాంతాలలో జూదాలు సాగుతున్నాయి. రోజుకు కోట్లాది రూపాయల డబ్బు చేతులు మారుతోంది. పులివెందులలో ఎన్నడూ లేని విష సంస్కృతిని టీడీపీ హయాంలో తీసుకొచ్చారని ఆ ప్రాంత ప్రజలు వాపోతున్నారు. గత నెలలో జరిగిన సంక్రాంతి పందేల ముసుగులో గోవా జూద సంస్కృతిని తెచ్చి యథేచ్ఛగా టెంట్లు వేసి జరిపించారు. వీటి ద్వారా టీడీపీ నాయకులు ప్రతి రోజు లక్షల్లో దండుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పులివెందుల పట్టణానికి నూతనంగా వచ్చిన ఎస్‌ఐ తెలుగుదేశం పార్టీ జూదశాలపై దాడి చేయగా, ఆ ఎస్‌ఐని అధికార పార్టీ నాయకులు స్టేషన్‌లోనే దుర్భాషలాడటమే కాకుండా పులివెందుల నుంచి ట్రాన్స్‌ఫర్‌ కూడా చేయించారు.

అప్పుల పాలవుతున్న కుటుంబాలు

నియోజకవర్గంలో యథేచ్చగా జూదాలు ఆడుతుండటంతో.. వీటికి బానిసలైన కొంత మంది డబ్బులు పోగొట్టుకుని వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. కొన్ని నెలల క్రితం సింహాద్రిపురం మండలానికి చెందిన ఓ వ్యక్తి జూదంలో డబ్బులు పోగొట్టుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. అంతేకాకుండా లింగాల మండలానికి చెందిన ఓ వ్యక్తి, పులివెందుల మండలానికి చెందిన మరో వ్యక్తి జూదంలో డబ్బులు కోల్పోయి అప్పుల పాలైనట్లుగా తెలుస్తోంది. సంక్రాంతి ముసుగులో జరిగిన జూదాలలో అనేక మంది డబ్బులు పొగొట్టుకుని అప్పుల పాలయ్యారు. వీరి కుటుంబాలు రోడ్డు పాలవ్వడానికి టీడీపీ నాయకులు నిర్వహిస్తున్న జూదశాలలే కారణమని బలమైన ఆరోపణలు ఉన్నాయి. కానీ అవన్ని తమకు పట్టనట్లుగా తమ అక్రమార్జనే ధ్యేయంగా టీడీపీ నాయకులు ముందుకు వెళ్తున్నారు.

అరికట్టాల్సిన వారే..

పులివెందులలో ఖాకీపై ఖద్దరు సవారీ చేస్తుందనడానికి అక్కడ జరుగుతున్న సంఘటనలే ఉదాహరణలుగా చెప్పవచ్చు. అధికార పార్టీ నాయకుల ఒత్తిడి మేరకు వైఎస్సార్‌సీపీ నాయకులపైన అక్రమంగా కేసులు బనాయించి, ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మట్కా, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలు టీడీపీ నాయకుల కనుసన్నల్లో పేట్రేగిపోతున్నప్పటికీ పోలీసులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. ఇందుకు ఆయా పోలీసు అధికారులకు భారీ ఎత్తున ముడుపులు అందుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. తమ కళ్లెదుటే జూదం జరుగుతున్నా పోలీసులు పట్టించుకోకపోవడంతో యథేచ్ఛగా జూదశాలలు నిర్వహిస్తున్నారు. అసాంఘిక కార్యకలాపాలను అరికట్టాల్సిన పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరించడం పట్ల ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వస్తోంది.

థర్డ్‌ డిగ్రీ ప్రయోగించిన వారిపై

ఎన్‌హెచ్‌ఆర్‌సీకి ఫిర్యాదు

పులివెందులలో యథేచ్ఛగా జూదాలు

అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో స్థావరాలు

చోద్యం చూస్తున్న ఖాకీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement