కుందూలో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం | - | Sakshi
Sakshi News home page

కుందూలో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం

Mar 23 2026 8:33 AM | Updated on Mar 23 2026 8:33 AM

జమ్మలమడుగు రూరల్‌ : పెద్దముడియంలోని కుందూ నదిలో శనివారం గల్లంతైన గొడుగు సురేష్‌ (41) మృతదేహం ఆదివారం లభ్యమైంది. పోలీసులు ఇచ్చిన వివరాలు ఇలా ఉన్నాయి. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణానికి చెందిన గొడుగు సురేష్‌ అనే వ్యక్తి పెద్దముడియంలో జరుగుతున్న ఎడ్ల పోటీలను తిలకించడానికి శనివారం వచ్చాడు. మధ్యలో కుందూ నదిలో ఈత కొట్టేందుకు వెళ్లాడు. ఈ నేపథ్యంలో నదిలో గల్లంతయ్యాడు. పోలీసులు ఎంత గాలించినా అతని జాడ కనిపించలేదు. ఆదివారం మృతదేహం లభ్యమైంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పెద్దముడియం పోలీసులు తెలిపారు.

అరటి రైతులనుప్రభుత్వం ఆదుకోవాలి

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌ : యుద్ధ ప్రభావం వల్ల మార్కెట్‌లో ధర పడిపోవడం, అకాల వర్షాల కారణంగా పంటలు నష్టపోయిన అరటి రైతులను ప్రభుత్వం తక్షణం ఆదుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం సీపీఐ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలు వాణిజ్య వ్యవస్థపై ప్రత్యక్ష ప్రభావం చూపుతాయన్నారు. దిగుమతులు, ఎగుమతులు మందగించడం వల్ల వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్‌లో అస్థిరత ఏర్పడుతుందన్నారు. జిల్లాలో ప్రధానంగా పులివెందుల ప్రాంతంలో వేల ఎకరాలలో అరటి సాగు చేస్తున్నారన్నారు. అయితే యుద్ధ ప్రభావంతో ధరలు పూర్తిగా తగ్గిపోయాయని, దానికి తోడు అకాల వర్షాలతో అరటి చెట్లు కూలిపోవడం, గెలలు విరిగిపోవడంతో అరటిపంట పూర్తిగా దెబ్బతినిందన్నారు. అరటి పంటను క్వింటా రూ.15 వేలతో ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు పాల్గొన్నారు.

ద్విచక్రవాహనదారులు హెల్మెట్‌ ధరించాలి

కడప అర్బన్‌ : ద్విచక్రవాహనదారులు హెల్మెట్‌ తప్పనిసరిగా ధరించాలని, ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్‌ విశ్వనాథ్‌ హెచ్చరించారు. ఆదివారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన వాహన తనిఖీల్లో ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 240 కేసులు నమోదు చేసి, రూ. 48,550 జరిమానా విధించడం జరిగిందని ఎస్పీ తెలిపారు. కార్లలో వెళ్లే వారు సీట్‌ బెల్ట్‌ ధరించాలని ఆయన సూచించారు. రాంగ్‌ రూట్‌ డ్రైవింగ్‌ ప్రమాదకరమని, రాంగ్‌ రూట్‌ డ్రైవింగ్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఆటో బోల్తా..

ఆరుగురికి గాయాలు

కేవీపల్లె : ఆటో బోల్తా పడి ఆరుగురికి గాయాలైన సంఘటన మండలంలోని కుప్పంవారిపల్లె వద్ద చోటు చేసుకుంది. వివరాలిలా వున్నాయి. ఆదివారం మారేళ్ల నుంచి ఏపీ39డబ్ల్యూఈ0498 నంబరు గల ఆటో ప్రయాణికులతో పీలేరుకు బయలు దేరింది. మార్గం మధ్యలోని కుప్పంవారిపల్లె వద్ద ద్విచక్రవాహనాన్ని ఢీకొని అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మారేళ్ల రెడ్డివారిపల్లెకు చెందిన చంద్రకళ, సులోచన, సంధ్యారాణి, జ్ఞానదీపిక, విజయ్‌కుమార్‌తోపాటు ద్విచక్రవాహనదారుడు సురేంద్ర గాయపడ్డారు. మరో ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement