మదనపల్లె టౌన్ : భూ వివాదం తలెత్తి రైతుపై ప్రత్యర్థులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ సంఘటన ఆదివారం రామసముద్రం మండలంలో జరిగింది. బాధితుడి కుటుంబీకులు తెలిపిన వివరాలు.. మండలంలోని ఊలపాడు పంచాయతీ భూసాని కురప్పల్లికి చెందిన రైతు మంజునాథ్(45)కు అదే ఊరికి చెందిన సిద్దరాజు, వెంకటరమణ, శ్రీనివాసులుకు కొంత కాలంగా భూ వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో ఉదయం పొలం వద్దకు వెళ్తున్న మంజునాథ్‌ను.. దారి కాచి కర్రలతో కొట్టి తీవ్రంగా గాయపరిచారు. బాధితుడిని కుటుంబీకులు హుటాహుటిన మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి వైద్యులు మెరుగైన వైద్యం అందించారు. రామసముద్రం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
మదనపల్లె టౌన్ : ఉరి వేసుకుని ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన విషాదకర సంఘటన ఆదివారం కురబలకోట మండలంలో జరిగింది. ఆత్మహత్యకు సంబంధించి మృతురాలి కుటుంబీకులు, ముదివేడు పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని బ్రాహ్మణ వడ్డిపల్లెకు చెందిన రమణ కుమార్తె సౌజన్య(17) మదనపల్లెలోని ఓ ప్రయివేట్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతుండేది. ఆదివారం తల్లిదండ్రులతో కలసి వ్యవసాయ బోరు వద్దకు వెళ్లి, పాడి పశువులకు గడ్డి కోసుకుని ఇంటికి వచ్చింది. అంతలోనే ఎందుకు చిన్న మనసు చేసుకుందో ఏమో..? తను ఉంటున్న ఇంటిలోనే తల్లి చీర కొంగును ఫ్యానుకు బిగించి, ఉరి వేసుకుని బలవన్మరణం చెందింది. సంఘటనను గమనించిన తల్లిదండ్రులు బిడ్డను ఉరి నుంచి తప్పించి, చికిత్సల నిమిత్తం హుటాహుటిన మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి, అప్పటికే సౌజన్య చనిపోయినట్లు నిర్ధారించారు. ఆస్పత్రి ఔట్‌పోస్టు పోలీసుల సమాచారంతో ముదివేడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడి కావాల్సి ఉంది.


