కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : అమరవీరులు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్‌దేవ్‌ల వర్ధంతి కార్యక్రమాలను జయప్రదం చేయాలని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు పెద్దుల్లపల్లి ప్రభాకర్, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి లింగదారి చంద్ర తెలిపారు. ఆదివారం నగరంలోని హోచిమన్ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా సంపూర్ణ స్వాతంత్య్రం కోసం పోరాడి పార్లమెంటులో సైతం బాంబులు వేసి వెనుతిరగకుండా ఎదురొడ్డి నిలిచిన మహనీయులు అని అన్నారు. లాలా లజపత్ రాయ్ మరణానికి ప్రతీకార చర్యగా, బ్రిటిష్ పోలీసు అధికారి జాన్ సాండర్స్ హత్యలో పాలుపంచుకున్నారనే నెపంతో ఆ మహనీయులని ఉరి తీశారన్నారు. అతి చిన్న వయసులో దేశం కోసం ప్రాణాలర్పించిన భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్‌దేవ్‌ల వర్ధంతి సందర్భంగా సోమవారం కడప నగరంలో ఏఐఎస్‌ఎఫ్, ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో స్థానిక కోటిరెడ్డి సర్కిల్ నుంచి ఏడు రోడ్ల కూడలి వరకు కాగడాల ప్రదర్శన నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కే నారాయణ, జాతీయ కార్యవర్గ సభ్యులు నాగేశ్వరరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర ముఖ్య అతిథులుగా పాల్గొంటారన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్, ఏఐవైఎఫ్ నాయకులు బత్తల శివతేజ, శివ నాగేంద్ర పాల్గొన్నారు.


