కడప ఎడ్యుకేషన్ : కడపలోని యోగి వేమన విశ్వవిద్యాలయంలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ ఆధ్వర్యంలో ‘నెక్స్‌జన్ జీఎస్టీ సంస్కరణలు (జీఎస్టీ 2.0) దక్షిణ భారత రాష్ట్రాల్లో స్థోమత, ఉపాధి, ఆరోగ్యం, స్థిరత్వం, వికసిత్ భారత్‌పై ప్రభావం (జీఎస్టీ ఏఈహెచ్‌ఎస్–2కె26)’ అనే అంశంపై ఈ నెల 24, 25 తేదీలలో రెండు రోజుల పాటు జాతీయ సెమినార్ నిర్వహించనున్నట్లు కన్వీనర్ డాక్టర్ పి.సరిత తెలిపారు. ఆమె ఆదివారం మీడియాకు వివరాలు వెల్లడించారు. ఈ సెమినార్‌కు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్– సదరన్ రీజినల్ సెంటర్ (ఐసీఎస్‌ఎస్‌ఆర్–ఎస్‌ఆర్‌సీ) స్పాన్సర్షిప్ అందిస్తోందన్నారు. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) రంగంలో వస్తున్న సంస్కరణలపై అధ్యాపకులు, పరిశోధక విద్యార్థులు, విద్యార్థులు చర్చించుకోవడం ఈ సెమినార్ ముఖ్య ఉద్దేశమని వివరించారు. విశ్వవిద్యాలయంలోని అన్నమాచార్య సెనేట్ హాల్‌లో 24వ తేదీ ఉదయం 10 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి యోగి వేమన విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ రాజశేఖర్ బెల్లంకొండ అధ్యక్షత వహిస్తారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ కమర్షియల్ ట్యాక్సెస్ శాఖ మాజీ ప్రధాన కమిషనర్ టి. రమేష్‌బాబు ప్రధాన అతిథిగా విచ్చేస్తారని చెప్పారు. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం ఫ్యాకల్టీ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ డీన్ ప్రొఫెసర్ పి.మోహన్‌రెడ్డి కీనోట్ స్పీకర్‌గా, గెస్ట్ ఆఫ్ హానర్‌గా పాల్గొంటారని తెలిపారు. ముగింపు సెషన్ మార్చి 25వ తేదీన తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం డిపార్ట్‌మెంట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ హెడ్ ప్రొఫెసర్ పి.రఘునాథరెడ్డి ప్రధాన అతిథిగా విచ్చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమానికి అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు భాగస్వాములై వికసిత్ భారత్ దృష్టితో జీఎస్టీ భవిష్యత్తుపై చర్చల్లో పాల్గొనాలని ఆమె కోరారు.


