ఉద్యోగుల అసంతృప్తి
ప్రభుత్వ నిర్ణయంపై సందేహాలు
శిక్షణా కేంద్రానికి
కడప రూరల్: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్ ( మేల్ ) ట్రైనింగ్ స్కూల్ నడుస్తోంది. 10వ తరగతి ఉత్తీర్ణత అర్హతతో ప్రతిభావంతులైన విద్యార్థులను ఎంపిక చేసి ప్రభుత్వం 18 నెలల పాటు శిక్షణ ఇస్తుంది. మహిళా అభ్యర్థులకు ఇచ్చే ఏఎన్‌ఎం తరహాలోనే ఈ శిక్షణ ఉంటుంది. శిక్షణ అనంతరం అభ్యర్థులు వైద్య ఆరోగ్యశాఖ పరిధిలోనే ఉద్యోగాలు పొందే అవకాశం ఏర్పడుతుంది. 2016వ సంవత్సరం వరకు శిక్షణలు బాగానే జరిగాయి. తర్వాత ఎందుకనో శిక్షణా కార్యక్రమాలను నిర్వహించలేదు. ఈ కేంద్రం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తుంది. ఇందుకుగాను 90 శాతం కేంద్రం, 10 శాతం రాష్ట్ర ప్రభుత్వం నిధులను కేటాయిస్తుంది. పాలకులు తీసుకున్న నిర్ణయం కారణంగా పురుషుల శిక్షణా కేంద్రాలకు గ్రహణం పట్టుకుంది.కాగా మహిళలకు మాత్రం యధావిధిగా శిక్షణా కార్యక్రమాలు జరుగుతున్నాయి. పైగా ప్రైవేట్ నర్సింగ్ కళాశాలలు కూడా విరివిగానే వెలిశాయి.
రాష్ట్రంలో మూడు కేంద్రాలపై ప్రభావం
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వానికి చెందిన పురుషుల ట్రైనింగ్ కేంద్రాలు వైఎస్సార్ కడప జిల్లా కేంద్రంలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం తో పాటు శ్రీకాకుళం, ఏలూరు జిల్లాలో ఉన్నాయి. ఈ కేంద్రాలు వైద్య ఆరోగ్యశాఖ ఏర్పడినప్పటి నుంచి కొనసాగుతున్నాయి. ఈ కేంద్రాల ద్వారా శిక్షణ పొందిన ఎంతోమంది పురుష అభ్యర్థులు ఉద్యోగాలు చేస్తున్నారు. కాగా 2016వ సంవత్సరం నుంచి ఈ కేంద్రాల్లో ఎలాంటి శిక్షణా కార్యక్రమాలు జరగలేదు. ఒక శిక్షణా కార్యక్రమంలో 17 మంది సిబ్బంది పనిచేస్తుంటారు. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన శాసనమండలి సమావేశాల్లో ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి ఈ శిక్షణ కేంద్రాల గురించి ప్రస్తావించారు. ఈ కేంద్రాల్లో శిక్షణ జరగలేదని, సిబ్బంది ఖాళీగా ఉన్నారని, వారిని వైద్య ఆరోగ్యశాఖలోనే ఇతర విభాగాల్లో పనిచేయించుకోవాలని సూచించారు. ఆ ప్రతిపాదనను ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ సమర్థించారు. ఈ శిక్షణా కేంద్రాల్లో పని చేస్తున్న సిబ్బందిని ఇతర విభాగాల్లో నియమించేలా చర్యలు చేపడతామని చెప్పారు. ఆ ప్రకారంగా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు శిక్షణ కేంద్రాల్లో పని చేస్తున్న ఉద్యోగులను ఇతర ప్రాంతాలకు బదలాయించడం జరుగుతోంది. కాగా కర్నూలు, విశాఖపట్నం, గుంటూరు జిల్లా కేంద్రాల్లోని శిక్షణా కేంద్రాలు, అందులోని సిబ్బంది యధావిధిగా కొనసాగడం గమనార్హం.
ప్రభుత్వ నిర్ణయంపై శిక్షణా కేంద్రంలో పనిచేస్తున్న ఉద్యోగులు తీవ్ర అసంతప్తిగా ఉన్నారు. ఇందుకు సంబంధించి 2014లో ప్రభుత్వం ఒక సర్దుబాటు జీవోను ఇచ్చింది. ఆ జీవో ప్రకారం శిక్షణా కేంద్రంలో పనిచేస్తున్న ఉద్యోగులను వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలోనే విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలి. అయితే అలా జరగడం లేదని ఆరోపిస్తున్నారు. ఇక్కడ డిప్యూటేషన్ పై పనిచేస్తున్న ఉద్యోగులను యధావిధిగా వారి స్థానాలకు పంపించి, ఆ స్థానాల్లో తమను నియమించుకోవాలనే వాదన వినిపిస్తోంది.
శిక్షణ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోనిది, ఏ నిర్ణయమైనా కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి అని ఉద్యోగులు వాదిస్తున్నారు. ప్రభుత్వం కేవలం వైఎస్సార్ కడప జిల్లాతో పాటు ఏలూరు, శ్రీకాకుళం జిల్లాలో పనిచేస్తున్న శిక్షణా కేంద్రంలోని ఉద్యోగులను ఇతర ప్రాంతాలకు బదలాయించారు. అయితే ఈ శిక్షణా కేంద్రాలను మూసేశారా.. తీసేసారా.. పూర్తిగా తొలగించారా అనేది సందిగ్ధంగా మారింది. అలాగే శిక్షణా కేంద్రాలను మరింతగా అభివద్ధి చేసి, అర్హులైన వారికి శిక్షణ ఇప్పించి, వారికి ఉద్యోగ ఉపాధి దారిని చూపించాలి. అలా కాకుండా ఎలాంటి శిక్షణ కార్యక్రమాలు జరగలేదని, ఆ కేంద్రాల్లో పని చేసే సిబ్బందిని ఇతర ఆరోగ్య కేంద్రాలకు బదలాయించడం ఎంతవరకు సబబనే ప్రశ్న తలెత్తుతోంది. ఈ తరుణంలో పాలకులు శిక్షణా కేంద్రాలకు మంగళహారతి ఇచ్చే అవకాశం ఉందనే అనుమానాలను ఉద్యోగులు వ్యక్తం చేస్తున్నారు.
శిక్షణలు లేవు.. సిబ్బంది ఎందుకనిప్రజాప్రతినిధుల నిర్ణయం
ఏంపీహెచ్ డబ్ల్యూ (ఎం)ట్రైనింగ్ స్కూల్ పై ప్రభావం
ఉన్న సిబ్బందిని ఇతర కేంద్రాలకు బదలాయింపు


