ఇసుక అక్రమ రవాణాను
సుండుపల్లె: ఇసుక తవ్వకాల వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని పంటలకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందడం లేదని, ఇసుక రీచ్‌ను ఆపాలని బహుదానది పరీవాహక ప్రాంతాల ప్రజలు, రైతులు ఆదివారం రీచ్ వద్ద ఆందోళన చేపట్టారు. మండల పరిధిలోని ఎరమనేనిపాలెం గ్రామ పంచాయతీ కుప్పగుట్ట సమీపంలో అధికార పార్టీ నాయకుల అండదండలతో టిప్పర్లతో ఇసుక తవ్వకాలు చేపట్టి బెంగళూరు, తమిళనాడు ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఆదివారం హిటాచీలతో ఇసుక తవ్వకాలు జరిపి తరలిస్తుండగా అడ్డుకుని ఆందోళన చేపట్టారు. బహుదానదిలో ఇసుక అక్రమ తవ్వకాల వల్ల భూగర్భజలాలు తగ్గిపోతున్నాయని,దీనివల్ల బోర్లలో నీరు రాక సాగు చేసిన పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని, అలా జరిగితే మేం వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని రైతులు వాపోయారు.
నిబంధనలు పాటించని రీచ్ నిర్వాహకులు
ప్రభుత్వ అనుమతుల ప్రకారం ఇసుక రీచ్‌లో ఒక మీటర్ లోతు వరకు మాత్రమే ఇసుక తీయాల్సి ఉంటుంది. కానీ క్వారీ దక్కించుకున్న నిర్వాహకులు నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు అవసరమైతే క్వారీని రద్దు చేయాల్సిన అధికారులు ఇటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. దాదాపు 4 నుంచి 5 కిలోమీటర్ల దూరం ఇసుకను తోడేసి విక్రయించుకుంటున్నారు.
● బహుదానదిలోని ఇసుకను హిటాచీలతో ప్రతిరోజూ వందలాది టిప్పర్లకు లోడ్‌చేసి కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు తరలిస్తున్నారని, దీంతో నదిలో పెద్ద గుంతలు ఏర్పడ్డాయని పలుమార్లు మండల, జిల్లా అధికారులకు అర్జీల రూపంలో తెలియజేసినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు వాపోయారు. ఇసుక అక్రమరవాణాకు పాల్పడతోంది అధికార పార్టీకి చెందిన నాయకులు కావడం వల్లే అధికారులు చూసీ చూడనట్లు వ్వవహరిస్తున్నారని చెబుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ చొరవ తీసుకొని ఇసుక అక్రమరవాణాను అరికట్టి రీచ్‌ను రద్దు చేయాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామన్నారు.
రీచ్ వద్ద రైతులు, ప్రజల ఆందోళన


