మైదుకూరు : ఆర్థిక ఇబ్బందులతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మైదుకూరులో జరిగింది. శుక్రవారం పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక ఇందిరమ్మ కాలనీలో నివాసం ఉంటున్న తుపాకుల శివశంకర్ (36) అనే యువకుడు గ్యాస్ స్టౌవ్‌లను రిపేరు చేస్తూ జీవనం సాగించేవాడు. ప్రొద్దుటూరుకు చెందిన అనిత అనే యువతితో వివాహం కాగా ఇద్దరు మగ పిల్లలు, ఇద్దరు ఆడ పిల్లలు సంతానం ఉన్నారు. తల్లిదండ్రుల నుంచి వేరుపడిన శివశంకర్ చెడు వ్యసనాలకు బానిసై ఆర్థిక ఇబ్బందులతో కుటుంబాన్ని పోషించలేక ఇబ్బందులు పడేవాడు. గురువారం రాత్రి భార్య, పిల్లలు అదే కాలనీలో తన ఇంటి సమీపంలో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లడంతో శివశంకర్ ఇంటిలో ఉరి వేసుకున్నాడు. అతని తండ్రి వీరభద్రయ్య, చుట్టుపక్కల వారు చూసి స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు డాక్టర్లు తెలిపారు. మృతుడి తండ్రి వీరభద్రయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


