● ముస్తాబైన ఈద్గాలు.. కడపలో ప్రత్యేక ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

● ముస్తాబైన ఈద్గాలు.. కడపలో ప్రత్యేక ఏర్పాట్లు

Mar 21 2026 5:11 AM | Updated on Mar 21 2026 5:11 AM

● ముస్తాబైన ఈద్గాలు.. కడపలో ప్రత్యేక ఏర్పాట్లు

ఆధ్యాత్మిక వేదిక సిద్ధం: రంజాన్‌ పండుగ పురస్కరించుకుని బిల్టప్‌ ఈద్గాలో ముస్లిం సోదరులకు రంజాన్‌ సందేశాన్ని అందించేందుకు తీర్చిదిద్దిన ముఖ్య వేదిక

ఎండల దృష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లు: కడపలోని బిల్టప్‌ ఈద్గా వద్ద ప్రార్థనలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన చలువ పందిళ్లు

కడప సెవెన్‌ రోడ్స్‌: క్రమశిక్షణ, దైవచింతన, దానగుణానికి ప్రతీకగా నిలిచే పవిత్ర రంజాన్‌ (ఈద్‌–ఉల్‌–ఫితర్‌) పండుగను జిల్లావ్యాప్తంగా ముస్లిం సోదరులు నేడు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. నెల రోజుల పాటు సాగిన కఠిన ఉపవాస దీక్షలు, తరావీ ప్రార్థనలు నిన్నటి నెలవంక దర్శనంతో ముగిశాయి. శనివారం పండుగ జరుపుకోవాలని మత పెద్దలు ప్రకటించడంతో జిల్లా అంతటా పండుగ వాతావరణం నెలకొంది.

ముస్తాబైన ఈద్గాలు..

పండుగ పురస్కరించుకుని కడప నగరంతో పాటు జిల్లాలోని అన్ని పట్టణాలు, గ్రామాల్లోని ఈద్గాలు, మసీదులు విద్యుత్‌ దీపాలతో ముస్తాబయ్యాయి. శనివారం ఉదయం జరగబోయే ప్రత్యేక ఈద్‌ ప్రార్థనల కోసం ముస్లింలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. కొత్త బట్టలు ధరించి, సుగంధ ద్రవ్యాలు పూసుకుని అల్లాహ్‌ ఆశీస్సుల కోసం ఈద్గాల వైపు అడుగులు వేస్తున్నారు.

మానవత్వానికి మారుపేరు..

సాటి మనిషిని ఆదుకోవడమే పరమార్థంగా భావించే ఈ పండుగ వేళ, పేదలకు ‘ఫిత్రా’ దానాలను అందజేస్తూ ముస్లింలు తమ ఉదారతను చాటుకుంటున్నారు. షీర్‌ ఖుర్మా మధురిమలతో, ఆలింగనాలతో ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ సోదరభావాన్ని చాటుతున్నారు.

ఉత్సాహంగా మార్కెట్లు..

పండుగ నేపథ్యంలో గత రెండు రోజులుగా కడప మార్కెట్లు జనంతో కిటకిటలాడాయి. బట్టలు, పండ్లు, సేమియాల కొనుగోళ్లతో వ్యాపార సముదాయాల్లో సందడి నెలకొంది.

పాలక సంస్థ మరియు

పోలీసుల బందోబస్తు

కడప నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో ఈద్గాల వద్ద తాగునీటి సౌకర్యం, పారిశుద్ధ్యం, ఎండ నుంచి ఉపశమనం కోసం చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. ప్రార్థనలు ప్రశాంతంగా జరిగేలా పోలీసు శాఖ పటిష్టమైన బందోబస్తును కల్పించడమే కాకుండా, ట్రాఫిక్‌ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. జిల్లావ్యాప్తంగా ఎక్కడ చూసినా పండుగ ఉత్సాహం, సందడి వాతావరణం కనిపిస్తోంది.

నేడు పవిత్ర ఈద్‌–ఉల్‌–ఫితర్‌ పర్వదినం

నెలవంక దర్శనంతో ముగిసిన రోజాలు,తరావీ ప్రార్థనలు

ఈద్‌ ప్రత్యేకప్రార్థనలకుసిద్దమైన ఈద్గాలు, మసీదులు

నేడే పవిత్ర ఈద్‌–ఉల్‌–ఫితర్‌ పర్వదినం

భక్తిశ్రద్ధలతో ముగిసిన రంజాన్‌ మాసం

నగరంలోని ప్రధాన ఈద్గాలు ప్రార్థనల కోసం ముస్తాబయ్యాయి. ముఖ్యంగా...

బిల్టప్‌ ఈద్గా

ఆలంఖాన్‌పల్లె వద్దగల దండు షాహీ ఈద్గా

జమాల్‌పల్లె, మాచుపల్లె ఈద్గాలు

రిమ్స్‌ వద్దగల ఈద్గా

ఈ ప్రాంతాల్లో వేల సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉండటంతో ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement