లింగాల: మండల కేంద్రమైన లింగాలలో శుక్రవారం సాయంత్రం కుందేళ్ల పార్వేటను నిర్వహించారు. ప్రతి ఏటా ఉగాది పండుగ పార్ణమి రోజు కేందేళ్ల పార్వేట కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా సాగుతోంది. ఎగువ లింగాలకు చెందిన యువకులు అడవికి వెళ్లి వలలు వేసి కుందేళ్లను ప్రాణాలతో పట్టుకుని తీసుకొస్తారు. పార్ణమి రోజు కుందేళ్లను రామాలయం నుంచి సీతారామ, ఆంజనేయస్వామి ఉత్సవ విగ్రహాలను తప్పెట్లు, మేళాలతో ఊరేగింపుగా గ్రామ సమీపంలోని పొలాల్లోకి తీసుకొస్తారు. సీతారాముల పల్లకిని పొలంలో ఉంచి అక్కడ రామ భజనలు నిర్వహిస్తారు. అనంతరం యువకులు తీసుకొచ్చిన కుందేళ్లను జనాల మధ్య వదిలుతారు.వాటిని యువకులు, పిల్లలు పారిపోకుండా పట్టుకుంటూ ఉల్లాసంగా కేరింతలు వేస్తూ పార్వేట నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ రైతు విభాగపు నియోజకవర్గ కన్వీనర్ సారెడ్డి చంద్రశేఖరరెడ్డి, గ్రామ పెద్దలు కుందేళ్లను చూపిస్తూ పార్వేటను ప్రారంభించారు. ఇందులో ఎగువ లింగాల, దిగువ లింగాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


