రాయచోటి టౌన్: రాయచోటి పట్టణంలోని వెలసిన శ్రీ భద్రకాళీ అమ్మవారి ఆలయంలో శుక్రవారం రాహుకాల పూజలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ పాలక మండలి అధ్యక్షులు తిరుమల మనోజ్‌కుమార్, ఈవో వి. రమణారెడ్డిల పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. ముందుగా ఆలయ ప్రధాన అర్చకులు అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలు, రంగురంగుల పుష్పాలతో అలంకరించారు. రాహుకాల పూజల విశిష్టతను చాటుతూ అమ్మవారికి నిమ్మకాయల హారాలను సమర్పించి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించి, తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా అర్చకులు రాహుకాల పూజల వల్ల కలిగే ఆధ్యాత్మిక ప్రయోజనాలను భక్తులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


