ఒంటిమిట్ట: ఆంధ్ర భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో గురువారం టీటీడీ అధికారుల ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెల్లవారుజామున మూలమూర్తులకు పంచామృతాభిషేకాలు నిర్వహించారు. నూతన పట్టువస్త్రాలను తొడిగి, సుగంధపరిమలమైన తులసీ గజమాలతో సుందరంగా అలంకరించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువ జామునుంచే భక్తులు స్నానాలు ఆచరించి స్వామి దర్శనార్థం క్యూ లైన్‌లో బారులు తీరారు. సాయంత్రం సీతారామలక్ష్మణ ఉత్సవ మూర్తులకు గ్రామోత్సవం నిర్వహించారు.
అలరించిన పంచాంగ పఠనం: టీటీడీ ఆధ్వర్యంలో ఆస్థాన పురోహితులు ఏలేశ్వరం గురుస్వామి, మధు స్వామి శ్రీ పరాభవ నామ సంవత్సరం పంచాంగ పఠనం చేశారు. ఈ సంఏడాదిలో అహంకారాన్ని జయించి, వినయా న్ని అలవర్చుకోవాలని, ఆత్మపరిశీలన ద్వారా ఆత్మోన్నతిని సాధించాలని సూచిస్తుందన్నారు. టీటీడీ ఆలయ ఇన్స్పెక్టర్ నవీన్ కుమార్, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.


