ప్రొద్దుటూరు కల్చరల్ : స్థానిక నడింపల్లెలోని సాంఘిక సంక్షేమ శాఖ ఎస్సీ బాలుర వసతి గృహం వార్డెన్ బ్రహ్మానందరెడ్డిని సస్పెండ్ చేస్తూ ఆ శాఖ డిప్యూటీ డైరెక్టర్ సరస్వతి ఉత్తర్వులు జారీ చేశారు. వసతి గృహంలో ఈనెల 2వ తేదీ రాత్రి మైలవరం మండలం కల్లుట్ల గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థి తలారి నరసింహులు చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటనపై స్పందించిన జిల్లా అధికారులు విధి నిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శించారని హాస్టల్ వార్డెన్ బ్రహ్మానందరెడ్డి, వాచ్‌మెన్ రవిలను సస్పెండ్ చేశారు. పర్యవేక్షణ లోపంపై వివరణ ఇవ్వాలని ఉన్నతాధికారులు ఏఎస్‌డబ్ల్యూఓ రామయ్యకు మెమో జారీ చేశారు.
నాకాబందీ
ఎర్రగుంట్ల : యర్రగుంట్ల పట్టణంలోని ప్రకాశ్‌నగర్ కాలనీలో శనివారం తెల్లవారుజామున నాకాబందీ నిర్వహించినట్లు ఎర్రగుంట్ల సీఐ విశ్వనాథరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా కాలనీలోని ఇళ్లలో తనిఖీ చేపట్టారు. రికార్డు లేని 23 బైక్‌లను, రెండు ఆటోలను సీజ్ చేసినట్లు సీఐ తెలిపారు. కాలనీలో ప్రజలకు అవగాహన కౌన్సెలింగ్ అందించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐలు నాగమురళి, రామాంజనేయులు, కలమల్ల ఎస్‌ఐ సునీల్‌కుమార్‌రెడ్డిలతో సబ్ డివిజన్ పరిధిలోని ఎస్‌ఐలు పోలీసులు పాల్గొన్నారు.
టమాటాల లారీ బోల్తా
లింగాల : లింగాల మండలం వెలిదండ్ల గ్రామ సమీపంలోని కొండమోటు క్రాస్ వద్ద టమోటాల లోడ్‌తో వెళుతున్న లారీ బోల్తా పడింది. వివరాలలోకి వెళితే.. పార్నపల్లికి చెందిన పండు టమోటాల మండి వద్ద లోడ్ చేసుకుని వెళుతున్న లారీ శనివారం రాత్రి 7 గంటల ప్రాంతంలో అదుపుతప్పి బోల్తా పడింది. సుమారు 20 టన్నులతో వెళ్తున్న లారీ బోల్తాపడడంతో సుమారు నాలుగు లక్షల దాకా నష్టం వాటిల్లిందని టమోటాల మండి వ్యాపారి పండు తెలిపారు. అయితే ఎవరికీ ఎలాంటి ప్రమాదం సంభవించలేదు.
రాజంపేట వైద్యుల
నైపుణ్యం భేష్
కడప సెవెన్‌రోడ్స్ : హై రిస్క్ గర్భిణి కేసును సాహసోపేతంగా, విజయవంతంగా నిర్వహించి ఆమె ప్రాణాల్ని కాపాడిన రాజంపేట ఏరియా ఆసుపత్రి వైద్యుల బృందాన్ని సెకండరీ హెల్త్ డైరెక్టర్ ఎం.వి.చక్రధర్ బాబు ప్రశంసించారు. హైరిస్క్ ఆపలేషన్ వార్తను తెలుసుకున్న వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ సూచన మేరకు డాక్టర్లకు చక్రధర్‌బాబు ప్రశంసిస్తూ శనివారం లేఖ రాశారు. పేరుపేరునా వైద్యుల్ని, ఇతర సిబ్బందిని లేఖలో అభినందించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పివియన్ రాజు, గైనకాలజిస్ట్ డాక్టర్ సిహెచ్ అనిల్ కుమార్ బృందంలోని డాక్టర్ అబుబకర్, డాక్టర్ గిరి, నర్సులు సరళ, శ్రీలక్ష్మి, అసిస్టెంట్ విజయ్‌లను అభినందించారు. గర్భిణి ఇ. శంకరమ్మను తిరుపతిలోని పలు కార్పొరేట్ ఆసుపత్రులకు తీసుకెళ్లగా చికిత్సకు యాజమాన్యాలు నిరాకరించాయి. ఈమె గర్భ సంచిలో పిండం చనిపోయినందున ఆపరేషన్ చేసి రిస్క్ తీసుకోలేమని, తల్లి ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని చెప్పి పంపించేశారు. చివరికి అన్నమయ్య జిల్లా రాజంపేట ఏరియా ఆసుపత్రికి ఈమెను శుక్రవారం తీసుకురాగా విజయవంతంగా ఆపరేషన్ నిర్వహించారు. ప్రభుత్వాసుపత్రుల్లో అత్యంత ప్రతిభ, నైపుణ్యం గల స్పెషలిస్ట్ డాక్టర్లున్నారని, ఇలాంటి క్లిష్టమైన కేసుల్ని నిబద్ధతతో నిర్వహించడం ద్వారా ప్రజారోగ్య పరిరక్షణ పట్ల డాక్టర్లు పడ్డ తపన అత్యంత ప్రశసించదగ్గ విషయమని ఆయన లేఖలో పేర్కొన్నారు.
అట్లూరు : మండల పరిధిలోని కడప–బద్వేలు ప్రధాన రహదారిపై అయ్యప్పస్వామి ఆలయ సమీపాన రోడ్డు ప్రమాదానికి గురైన యువకుడు మాడపూరు వెంకటరమణ మృతి చెందినట్లు అతని బంధువులు శనివారం తెలిపారు. ఈ నెల 4న వరికుంట ఎస్సీ కాలనీకి చెందిన మాడపూరు వెంకటరమణ ద్విచక్రవాహనంపై సొంత పనులపై వెళ్లి తిరిగి రాత్రి ఇంటికి వెళుతుండగా అట్లూరు మండలం చౌటపల్లె గ్రామానికి చెందిన భాస్కర్ ఆచారి కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో వెంకటరమణ తీవ్రంగా గాయపడ్డాడు. 108 వాహనంలో అతన్ని కడప రిమ్స్‌కు తరలించగా మెరుగైన వైద్యం కోసం రాయవేలూరుకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతి చెందినట్లు మృతుని బంధువులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టినట్టు పోలీసులు పేర్కొన్నారు.


