కమలాపురం : కడప–తాడిపత్రి ప్రధాన రహదారిలో మండలంలోని రామచంద్రాపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో జంగంపల్లెకు చెందిన పుత్తా రామచంద్రారెడ్డి (48) అనే వ్యక్తి దుర్మరణం చెందాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. పుత్తా రామచంద్రారెడ్డి శనివారం మధ్యాహ్నం తన బైక్‌పై జంగంపల్లె నుంచి కమలాపురానికి పొలాల రస్తా నుంచి బయలు దేరాడు. రామచంద్రాపురం వద్దకు రాగానే వెనుక నుంచి వస్తున్న టిప్పర్ బైక్‌ను వేగంగా ఢీకొన్నది. ఈ ఘటనలో రామచంద్రారెడ్డి తీవ్ర గాయాల పాలై అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీశారు. పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. కాగా మృతుడికి భార్య కవిత, ఇంటర్, టెన్త్ క్లాస్ చదివే కుమార్తెలతోపాటు కుమారుడు ఉన్నాడు. అందరితో కలివిడిగా ఉండే రామచంద్రారెడ్డి మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.


