ఏమిటీ సర్వే...?
● జేఎల్‌ఎంలకు తప్పని సర్వే కష్టాలు
● మున్సిపల్ అధికారులు, ఎంపీడీఓల నుంచి ఒత్తిళ్లు
● చెప్పినట్లు చేయకపోతే మెమోలు
కడప కార్పొరేషన్: ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉండి ప్రభుత్వ పథకాలను ప్రజలకు నేరుగా అందించాలన్న సదుద్దేశ్యంతో గత వైస్సార్ సీపీ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చింది. అందులో 10 శాఖలకు సంబంధించిన ఉద్యోగులను నియమించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సచివాలయ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసింది. సచివాలయ ఉద్యోగులను సర్వేలకు మాత్రమే పరిమితం చేసింది. వారిలో అత్యవసర విద్యుత్ సేవల కోసం ఉద్దేశించిన జూనియర్ లైన్ మెన్లు (ఎనర్జీ అసిస్టెంట్)లకు యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే (యూఎఫ్‌ఎస్) చేయాలని ఎంపీడీవోలు, మున్సిపల్ అధికారులు వారిపై ఒత్తిడి చేస్తున్నారు. విద్యుత్‌శాఖ అధికారులు సైతం టార్గెట్లు ఇచ్చి విద్యుత్ పనులు చేయాలని ఒత్తిడి తెస్తున్నారు. దీంతో రెండు శాఖల పనులు చేయలేక గ్రేడ్–2 జేఎల్‌ఎంలు సతమతమవుతున్నారు. సర్వేలు చేయకపోయినా, విద్యుత్ శాఖకు సంబంధించిన పనులు చేయకపోయినా ఆ శాఖల అధికారులు మెమోలు జారీ చేస్తున్నారు. దీంతో వారు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. జూనియర్ మెన్లు ఆయా విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో సీనియర్ లైన్‌న్‌మెన్లకు సహాయకులుగా ఉంటూ గ్రామాల్లో, పట్టణాల్లో విద్యుత్ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాల్సి ఉంటుంది. అలాగే నూతన కరెంట్ మీటర్లు, లైన్ల ఏర్పాటు, మరమ్మతులు తదితర మసలు చేయాల్సి ఉంటుంది. ప్రజలకు అవసరమైన కరెంట్ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నదివాలయంలో పనిచేస్తున్న పది శాఖల చెందిన సెక్రటరీలు, అసిస్టెంట్లకు యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే చేయాలని ఆదేశించింది. దీంతోపాటు ప్రతినెలా 1వ తేది నుంచరి 5వ తేది వరకూ పింఛన్ల పంపిణీ కూడా చేయాలి. యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే చేయడంతోపాటు విద్యుత్ అత్యవసర సేవలకు వెళ్లాలని ఉత్తర్వులు జారీ చేయడం పట్ల జేఎల్‌ఎంలు ఆందోళన చెందుతున్నారు. విద్యుత్‌కు సంబంధించిన పనులకు, మిగతా విధులకు చాలా తేడా ఉంటుంది. వారు నిత్యం విద్యుత్ వద్ద పనిచేయాల్సి ఉంటుంది కాబట్టి వెంటనే ఫోన్లు ఎత్తడం, ఇతర పనులు చేయడం సాధ్యం కాదు. ఇప్పటికే విద్యుత్ ప్రమాదాల కారణంగా చాలామంది జేఎల్‌ఎంలు మరణించారని, కొందరు కాళ్లు, చేతులు పోగొట్టుకున్నారని ఉద్యోగ సంఘ నాయకులు చెబుతున్నారు. రెండు శాఖల విధులు నిర్వహించడం తమకు కష్టతరంగా మారిందని, ఏదో ఒక శాఖకు చెందిన విధులు మాత్రమే అప్పగించాలని జేఎల్‌ఎంలు ప్రజా ప్రతినిధులు, అధికారులకు మొరపెట్టుకుంటున్నా వారి మొర వినే నాథుడే కరువయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సచివాలయ ఉద్యోగులను ఆయా శాఖల్లో విలీనం చేస్తామని చెప్పారు. ఇందుకు సంబంధించిన ఆదేశాలు వచ్చినా మళ్లీ సచివాలయాల్లోనూ, విద్యుత్ శాఖలోనూ పనిచే యించుకుంటున్నారు.
సచివాలయాల పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులకు యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రతి సచివాలయ ఉద్యోగి ప్రతిరోజూ తమ పరిధిలో ఉన్న 25 కుటుంబాల నుంచి వివరాలు సేకరించి ఆధార్, ఈకేవైసీ చేయడంతోపాటు వారి ఇంట్లో ఉన్నవారు ఏమేం పనులు చేస్తున్నారు, వారికి రిఫ్రిజిరేటర్, కారు, ఏసీ, ఇతరత్రాలాంటివి వున్నాయా వంటి సుమారు 75 రకాల ప్రశ్నలు వేసి వారి నుంచి సమాధానాలు రాబట్టాల్సి ఉంటుంది. ఇలా ఒక కుటుంబం దగ్గర కనీసం 15 నుంచి 20 నిముషాలు కేటాయించి సమాచారం రాబట్టాల్సి ఉంటుంది. దీంతో సమయమంతా సర్వేకే సరిపోతోందని, విద్యుత్ శాఖకు సంబంధించిన పనులు పెండింగ్‌లో పడిపోతున్నాయని చెబుతున్నారు.
ఎనర్జీ అసిస్టెంట్లు లేదా గ్రేడ్–2 జేఎల్‌ఎంల ఎంపిక సచివాలయాల పరిధిలో జరిగింది. వారిని సచివాలయ ఉద్యోగుల కిందనే ప్రభుత్వం పరిగణిస్తోంది. కానీ జీతాలు మాత్రం విద్యుత్ శాఖ చెల్లిస్తోంది. వీరు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఏఈ)ల పరిధిలో పనులు చేస్తుంటారు. నూతన సర్వీసుల మంజూరు, డీసీ లిస్టు, లూజ్‌లైన్లు బాగు చేయడం, 11కేవీ బ్రేక్ డౌన్ సరిచేయడం, ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతులు వంటి పనులకు లైన్‌మెన్లకు సాయంగా పనిచేస్తుంటారు. వీటికి తోడు సెక్షన్ల పరిధిలో ఉద్యోగుల సంఖ్యను బట్టి రాత్రి విధులు కూడా నిర్వహిస్తున్నారు. ఇప్పుడు అదనంగా యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే పనులు కూడా చేయాల్సి రావడంతో రెండింటినీ సమన్వయం చేసుకోలేక సతమతమవుతున్నారు. పని ఉంటే రోజంతా అటు విద్యుత్ శాఖలోనో, లేక సర్వే చేయడానికే సరిపోతోందని, దీనివల్ల అటు విద్యుత్ సమస్యలు లేదా సర్వే పనులు పెండింగ్‌లో పడుతున్నాయని చెబుతున్నారు. దీనికి తోడు అధికారుల ఒత్తిడి కూడా ఎక్కువగా ఉందని, దీన్ని నివారించాలని వారు కోరుతున్నారు.


