జనగణనలో కచ్చితమైన డేటా అత్యంత కీలకం | - | Sakshi
Sakshi News home page

జనగణనలో కచ్చితమైన డేటా అత్యంత కీలకం

Mar 7 2026 8:12 AM | Updated on Mar 7 2026 8:12 AM

కడప సెవెన్‌రోడ్స్‌: జనగణన సర్వే ప్రక్రియలో అధునాతన సాంకేతిక పరిజ్ఞాన వినియోగంతోపాటు కచ్చితమైన, దోషరహిత డేటా సేకరించడం అత్యంత కీలకమని, అపుడే స్పష్టమైన అభివృద్ధి ప్రణాళికల రూపకల్పన సాధ్యం అవుతుందని జిల్లా కలెక్టర్‌ – ప్రిన్సిపల్‌ సెన్సెస్‌ అధికారి డాక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని సభా భవన్‌ లో భారత సెన్సస్‌–2027 నిర్వహణకు సంబంధించి సర్వే నిర్వాహక అధికారులకు మూడు రోజుల పాటు నిర్వహించే జిల్లాస్థాయి శిక్షణా కార్యక్రమానికి డాక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జేసీ డాక్టర్‌ నిధి మీనా, డీఎఫ్‌ఓ వినీత్‌ కుమార్‌, రాజంపేట సబ్‌ కలెక్టర్‌ భావన, సెన్సెస్‌ జాయింట్‌ డైరెక్టర్‌ డా. జగన్నాథ్‌ మజ్జి, డీఆర్వో విశ్వేశ్వర నాయుడు హాజరయ్యారు. సెన్సెస్‌ ఆఫ్‌ ఇండియా 2027 నిర్వహణపై ఈ నెల 6 నుంచి 8వ తేదీ వరకు మొదటి విడతగా హౌస్‌ లిస్టింగ్‌ అండ్‌ హౌసింగ్‌ సెన్సస్‌లో భాగంగా జిల్లా, మున్సిపల్‌ కార్పొరేషన్‌ స్థాయిలో సెన్సస్‌ సర్వే నిర్వాహక అధికారులకు జాతీయ సెన్సెస్‌ విభాగ అధికారులతో శిక్షణ కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ సాంకేతిక ఆధారిత డేటా సేకరణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. డిజిటల్‌ సాంకేతికతల్లో సమాచార సేకరణ, డేటా ఎంట్రీలో కచ్చితత్వం, ఫీల్డ్‌ స్థాయి ధృవీకరణ ప్రక్రియలు వంటి వాటికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు. ఆధునిక సాఫ్ట్‌వేర్‌ వ్యవస్థల వినియోగంతో పారదర్శకత, వేగం, విశ్వసనీయత పెరుగుతాయని నిపుణులు వివరించారు.

● జేసీ డాక్టర్‌ నిధి మీనా మాట్లాడుతూ 2027 జనాభా లెక్కలు దేశంలోని మొత్తం జనాభాను కవర్‌ చేస్తుంది. ఈ ప్రక్రియలో భాగంగా నియమించిన సిబ్బంది ప్రతి ఇంటిని సందర్శించనున్నారు. గృహాల జాబితా, గృహ గణన, జనాభా గణన కోసం రూపొందించి ప్రత్యేక ప్రశ్నాపత్రంలోని అంశాలకు సమాధానాలను సేకరిస్తారన్నారు. ఎన్నికలు ఎంత సున్నితంగా, జాగ్రత్తగా, సమన్వయంతో, బాధ్యతతో ప్రధాన్యతగా నిర్వహిస్తామో అంతే ప్రముఖ్యతతో ఈ జన గణన సర్వే ప్రక్రియను కూడా జాగ్రత్తగా తప్పులు లేకుండా నిర్వహించాలన్నారు. సెన్సెస్‌ జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ జగన్నాథ్‌ మజ్జి, మాట్లాడుతూ జనగణన యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు.

● సెన్సస్‌ జిల్లా ఇంచార్జి మోహన్‌ రమణ మాట్లాడుతూ ఈ సెన్సస్‌ 2027 ప్రక్రియను రియల్‌ టైమ్‌ ప్రాతిపదికన నిర్వహించడానికి, పర్యవేక్షించడానికి సెన్సస్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ (సీఎంఎంఎస్‌) పోర్టల్‌ ద్వారా నిర్వహించడం జరుగుతోందన్నారు. కార్యక్రమంలో కేంద్ర సెన్సెస్‌ విభాగ డిప్యూటీ డైరెక్టర్‌ దివాకర్‌ బరిహ, సెన్సస్‌ జిల్లా ఇంచార్జి మోహన్‌ రమణ, సెన్సస్‌ జిల్లా నోడల్‌ అధికారి కిరణ్‌ కుమార్‌, కేఎంసీ కమిషనర్‌ రాకేష్‌, ఆర్డీఓలు చంద్ర మోహన్‌, చిన్నయ్య, ట్రైనింగ్‌లో టీమ్‌ సభ్యులు విష్ణు మాధురి, విష్ణు ప్రియా తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ డాక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement