స్ధానిక సంస్థల ప్రజాప్రతినిధులైన ఎంపీటీసీలపై కూటమి ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. వీరికి నెలనెలా చెల్లించాల్సిన గౌరవ వేతనం ఇవ్వకుండా అగౌరవ పరుస్తోంది. స్ధానిక మండల ప్రజాపరిషత్ కార్యాలయాల నుంచి బిల్లులు పెడుతున్నా నిధులు మాత్రం విడుదల చేయని దుస్థితి నెల కొంది.ఇటీవల జిల్లాలో మండల ప్రజాపరిషత్ కార్యాలయాలో జరుగుతున్న సమావేశాల్లో ఎంపీటీసీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంఽఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
● ఎంపీటీసీ సభ్యులపై
కూటమి ప్రభుత్వం చిన్నచూపు
● జిల్లాలో వేతన బకాయిలు రూ.4.19 కోట్లు
● జిలాల్లో 559 మంది ఎంపీటీసీ సభ్యులు
బద్వేలు: వైఎస్‌ఆర్ కడప జిల్లాలో 559 మంది ఎంపిటిసీ సభ్యులు గౌరవ వేతనం కోసం రెండేళ్లుగా ఎదురుచూస్తున్నారు. అయినా కూటమి ప్రభుత్వానికి చలనం లేదు. మరో రెండు నెలల్లో (ఏప్రిల్ 2026) వీరి పదవీ కాలం కూడా ముగియనుంది.దీంతో వీరిలో ఆందోళన మొదలైంది.ప్రజా ప్రతి నిధులుగా ఎన్నుకున్న ఎంపీటీసీలకు నిర్ధిష్టమైన విధులు లేవు. నిధులు అంతకన్నా లేవు. కేవలం తమ పరిధిలోని పంచాయతీల్లో జరిగే అభివృద్ధి పనులను పర్య వేక్షించడం ,గ్రామపంచాయతీ ప్రణాళికలు మండల పరిషత్ సమావేశాల్లో సమస్యలు లేవనెత్తడం, ప్రభుత్వ పథకాలన్నీ ప్రజలకు చేరేలా చూడడం వంటి పనులు చేసేందుకు మాత్రమే ఉన్నారు.అందుకే పంచాయతీల్లో గౌరవం లేదు.వీరిచేతుల్లో అభివృద్ధి పనులు అంతకన్నా లేవు.కనీసం ప్రభుత్వమే ఏర్పాటు చేసిన గౌరవ వేతనం రూ.3,000లు కూడా 25 నెలల నుంచి చేతికి అందడం లేదు.అభివృద్ధి పనులను పర్యవేక్షించేందుకు తిరగాల్సి ఉంది. ఖర్చులకు అవసరమైన డబ్బులు ఎక్కడి నుంచి తేవాలి అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వైఎస్సార్ కడప జిల్లాలో:
జిల్లాల్లో 559 ఎంపీటీసి సభ్యులు ఉన్నారు.వారికి నెలకు రూ.3,000 ల వంతున 25 నెలల బకాయిలు ఒకొక్కరికి రూ.75,000 ఉన్నాయి.559 మందికి కలిసి రూ.4.19 కోట్ల బకాయిలు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది.2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు గత వైఎస్సార్ ప్రభుత్వం ఎంపీటీసీలకు గౌరవ వేతనం అందజేసింది. తరువాత ఎన్నికల కోడ్ అమలు కావడంతో అప్పటి నుంచి గౌరవ వేతనం నిలిపి వేశారు.కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అవుతున్నా ఇంత వరకు వీరి గౌరవ వేతనంపై ఒక్క మాట కూడా మాట్లాడ లేదు.గౌరవ వేతన బకాయిలు చెల్లించాలని తరచూ మండల పరిషత్ సర్వసభ్య సమా వేశాల్లో సభ్యులు అధికారులను నిలదీస్తున్నారు.నిధుల విడుదల కోసం అదికారులు బిల్లులు పెడుతున్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సొంత డబ్బులు ఖర్చు చేసుకుని సమావేశాలకు హజరవుతున్నారు.జిల్లాలో దాదాపు 95 శాతం మంది వైఎస్సార్ కాంగ్రెస్‌కు చెందిన వారే కావడంతో ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం గౌరవ వేతనం బకాయిలు విడుదల చేయడంలేదని ఎంపీటీసీ సభ్యులు మండిపడుతున్నారు.మరో రెండు నెలలో మా పదవీ కాలం పూర్తికావస్తోందని, ఇప్పటికై నా గౌరవ వేతనాల బకాయిలు పూర్తిగా చెల్లించాలని కోరుతున్నారు.


