అడవికి నిప్పు.. వన్యప్రాణాలకు ముప్పు.. | - | Sakshi
Sakshi News home page

అడవికి నిప్పు.. వన్యప్రాణాలకు ముప్పు..

Mar 6 2026 8:26 AM | Updated on Mar 6 2026 8:26 AM

సిద్దవటం : అడవికి నిప్పు పెట్టడం వలన వన్యప్రాణులకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని కడప ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి ప్రసాద్‌ తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ మూలపల్లి, నేకనాపురం, భాకరాపేట, మాధవరం, ఉద్దిమడుగు, కనుములోపల్లె గ్రామాల్లో అటవీ ప్రాంతాల్లో కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు రాత్రివేళలో కొండకు నిప్పుపెడుతున్నారన్నారు. కొన్ని ప్రాంతాలపై రాత్రివేళలో నిఘా ఏర్పాటు చేశామన్నారు. కొండకు నిప్పు పెట్టడం చట్టరీత్యా నేరమని తెలిపారు. అటవీ ప్రాంతాలు పచ్చదనంతో ఉండేలా ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. గ్రామాల్లో అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తామని రేంజర్‌ తెలిపారు.

అన్నదాన ట్రస్ట్‌కు

రూ. లక్ష విరాళం

ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీకోదండ రామస్వామి ఆలయం అన్నదానం ట్రస్ట్‌ కు రూ. 1,01,116 విరాళం ఇచ్చారు. అన్నమయ్య జిల్లా, బి.కొత్తపేట మండల కేంద్రానికి చెందిన స్థానిక వ్యాపారి ఎస్‌. వెంకట రత్నమయ్య, ఎస్‌. సుభద్రమ్మ దంపతులు గురువారం ఒంటిమిట్ట టీటీడీ పరిపాల భవనంలో టీటీడీ జేఈవో వీరబ్రహ్మంకు విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా దాతను టీటీడీ జేఈవో వీరబ్రహ్మం శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో అన్నదానం ప్రత్యేక అధికారి జి.ఎల్‌. నరసింహ శాస్త్రి, డిప్యూటీ ఈవోలు రాజేంద్ర కుమార్‌, శివప్రసాద్‌, సెల్వం పాల్గొన్నారు.

ఆర్టీసీ బస్సుకు తప్పినప్రమాదం

రాజుపాళెం : రాజుపాళెం మండల పరిధిలోని వెంగళాయపల్లె– పగిడాల గ్రామాల మధ్యలో ఆర్టీసీ బస్సుకు గురువారం మధ్యాహ్నం పెను ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే... నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఆళ్లగడ్డ నుంచి చాగలమర్రి, రాజుపాళెం మీదుగా ప్రొద్దుటూరుకు వెళుతోంది. అయితే పగిడాల గ్రామం దాటిన తర్వాత వెంగళాయపల్లె గ్రామానికి సమీపంలో రోడ్డు పక్కనే ఉన్న ఉప కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌తో పాటు ప్రయాణికులకు గాయాలయ్యాయి. కాలువలో పడిన బస్సు అక్కడే నిలిచి పోవడంతో ప్రమాదం తప్పినట్లయింది. ఈ బస్సులో దాదాపు 22 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదం జరగడంతో అత్యవసర ద్వారం ద్వారా వారంతా బయటకు వచ్చారు. బస్సుకు ముందువైపు ఉన్న అద్దాలు పగలడంతో డ్రైవర్‌ కాలువలో పడిపోగా మిగతా ఇద్దరు మహిళలు, ఇద్దరు పిల్లలకు తీవ్ర గాయాలు కావడంతో వారిని చాగలమర్రి 108 వాహనంలో ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలంలో కాలువలో పడి ఉన్న డ్రైవరును అటుగా వెళుతున్న కుమ్మరపల్లె వైఎస్సార్‌సీపీ నాయకుడు నల్లదిమ్ము భాస్కర్‌ రెడ్డి తన కారులో రాజుపాళెంలోని పీహెచ్‌సీకి తీసుకెళ్లి వైద్యం చేయించారు. ఆయా గ్రామస్తులు సంఘటనా స్థలానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించి ప్రమాదం జరిగిన తీరును అక్కడున్న ప్రజలను ఎస్‌ఐ ప్రణయ్‌కుమార్‌ రెడ్డి అడిగి తెలుసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement