వేంపల్లె : మండలంలోని బక్కన్న గారి పల్లె గ్రామంలో రెడ్డిబోయిన. సూర్యనారాయణ (30) అనే రైతు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. బంధువులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు ఇలా ఉన్నాయి. బక్కన్న గారి పల్లె గ్రామానికి చెందిన రెడ్డి బోయిన సత్యనారాయణ కుమారుడు సూర్యనారాయణ కు 2.50 ఎకరాలు పొలం ఉంది. ఈ పొలంలో అరటి, మొక్కజొన్న, వేరుశనగ పంటలను సాగు చేసుకునేవారు. గతంలో తమ పొలంలో భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో ఐదు బోర్లు వేయించాడు. సుమారు 12 లక్షలకు పైగా అప్పులు చేశాడు. ఈ నేపథ్యంలో పంటలు సాగు చేయగా దిగుబడి రాకపోవడమే కాకుండా గిట్టుబాటు ధర రావడంలేదని తెలిపారు. దీంతో తెచ్చిన అప్పులు తీర్చలేక గురువారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నీ తో ఉరి వేసుకున్నాడు. ఈయనకు భార్య కళ్యాణి ఐదు సంవత్సరాల కొడుకు భాను ప్రకాష్, మూడు సంవత్సరాల కొడుకు రుషేంద్ర లు ఉన్నారు. భార్య కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉండేది. కుటుంబ పోషకుడు మృతి చెందడంతో కుటుంబం శోకసముద్రంలో మునిగిపోయింది. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
కౌలుతో కొలుకోలేక..
జమ్మలమడుగు: పెద్దముడియం మండలం కొండసుంకేసుల గ్రామానికి చెందిన భూమిరెడ్డి గారి చంద్రశేఖర్‌రెడ్డి (44) అనే రైతు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు, బంధువులు ఇచ్చిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. భూమిరెడ్డిచంద్రశేఖర్‌రెడ్డికి నాలుగు ఎకరాల భూమి ఉంది.ఈ భూమితో పాటు గత ఐదు సంవత్సరాల నుంచి గ్రామంలో 15 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని సాగుచేశాడు. మొత్తం 19 ఎకరాల్లో మొక్కజొన్న , మిరప పంటలు సాగుచేశాడు. అయితే సరైనవర్షాలు రాకపోవడంతోపాటు పంటలు సరిగా పండలేదు. గతేడాదిలో పంట ఏమాత్రం సాగుచేయలేకపోయాడు. పెట్టిన పెట్టుబడులతోపాటు కౌలు ఖర్చులు భారీగా పెరిగిపోయాయి. పంట కోసం చేసిన అప్పులు , వడ్డీలు పెరిగిపోతూ వచ్చాయి .దీంతో రైతుదిక్కుతోచని పరిస్థితిలో ఇంట్లో ఎవ్వరు లేని సమయంలో గురువారం ఆత్మహత్యకుపాల్పడినట్లు తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ
– బంగారు పతకం సాధించిన శివకోటి
నందలూరు : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్‌లో జరుగుతున్న 14వ జాతీయ స్థాయి పారాసిట్టింగ్ వాలీబాల్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ జట్టు రాణించింది. ఫైనల్లో కర్ణాటక రాష్ట్రంపై గెలిచి బంగారు పతకం సాధించింది. ఈ పోటీల్లో దేశం నలుమూలల నుంచి సుమారు 22 రాష్ట్రాల జట్లు పాల్గొన్నాయి. ఆంధ్రప్రదేశ్ జట్టు కర్ణాటకతో మొత్తం ఐదు సెట్లుగా సాగిన ఈ ఫైనల్ మ్యాచ్‌లో తొలి రెండు సెట్లు విజయం సాధించి తదుపరి రెండు సెట్లు కోల్పోయి నిర్ణయాత్మకమైన 5వ సెట్ గెలిచింది. 13 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఆంధ్ర పారా సిట్టింగ్ వాలీబాల్ క్రీడాకారులు టైటిల్‌ను కై వసం చేసుకున్నారు. ఆంధ్ర పారా సిట్టింగ్ వాలీబాల్ జట్టు ఫైనల్లో విజయం సాధించడంలో పారా వాలీబాల్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు బోడపాటి శివదత్ హర్షం వ్యక్తం చేశారు. కీలమైన సమయాల్లో జట్టును ముందుండి విజయంవైపు నడిపించిన కడప జిల్లా వాసి, నందలూరు ఆణిముత్యం శివకోటిని ప్రతి ఒక్కరూ అభినందించారు.


