తీవ్రంగా గాయపడిన నరసమ్మ, బందారుపల్లి వేములయ్య, వెంకటయ్య, కాలువలో బోల్తాపడిన ఆటో
అట్లూరు : మండల పరిధిలోని కడప – బద్వేలు ప్రధాన రహదారిపై లింగాలకుంట చెరువు మలుపులో గురువారం సాయంత్రం ఆటో బోల్తా పడిన సంఘటనలో 9 మంది గాయపడ్డారు. స్థానికులు, పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. అట్లూరు మండలం లింగాలకుంట ఎస్సీ కాలనీకి చెందిన బందారుపల్లి వేములయ్య ఆటోలో బద్వేలు నుంచి ప్రయాణికులను తీసుకుని సిద్ధవటం వైపు వస్తుండగా లింగాలకుంట చెరువు మలుపు వద్దకు వచ్చేసరిగా టైర్ పగిలింది. దీంతో ఆటో అదుపుతప్పి సుమారు 10 అడుగుల లోతు ఉన్న కాలువలో పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న 9 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో కీర్తన, నరసింహ, లక్షుమయ్య, వెంగమ్మ, వేములయ్య, వసంత, చెన్నమ్మ, నరసమ్మ, వెంకటయ్య ఉన్నారు. విషయం తెలుసుకున్న స్థానికులు, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను బద్వేలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆటుగా వెళుతున్న డీసీసీబీ చైర్మన్ సూ ర్యనారాయణరెడ్డి గాయపడిన వారిని తన కారులో పలువురిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న బద్వేలు రూరల్ సీఐ కృష్ణయ్య బద్వేలు ప్రభుత్వాస్పత్రికి వెళ్లి ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు సీఐ కృష్ణయ్య తెలిపారు.


