● మామిడికాయలకు రక్షణ కవచం
● 50 శాతం సబ్సిడీతో అందుబాటులో..
● ప్రతి రైతుకు 5 ఎకరాలకు వరకు..
కడప అగ్రికల్చర్ : జిల్లాలో 20 వేల ఎకరాల్లో మామిడి పంట సాగులో ఉంది. రైతులు సరైన యాజమాన్య చర్యలు చేపట్టినా.. పంట దిగుబడి సమయంలో కాయలకు పురుగులు, తెగుళ్లు ఆశించడంతో నాణ్యత తగ్గి దిగుబడులు పడిపోతున్నాయి. కాయ ఎదిగే దశలో పురుగులు, తెగుళ్లతో తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ చీడపీడల నివారణకు పూత ప్రారంభమైనప్పటి నుంచి కాయకోత వరకు దాదాపు 10 నుంచి 12 సార్లు పురుగుల నివారణ మందు పిచికారీ చేస్తున్నా ఫలితం కనిపించడం లేదు. దీంతో పెట్టుబడి భారీగా పెరిగి రైతులు ఆర్థికంగా చితికిపోతున్నారు. ఎక్కువసార్లు అధిక డోస్ కలిగిన పురుగుల నివారణ మందులు పిచికారి చేయడం వల్ల.. ఆ మందుల అవశేషాలు పండ్లల్లో ఉండి వాటిని తిన్నవారికి క్యాన్సర్ వంటి రోగాలు వస్తున్నాయి. ఈ క్రమంలో పురుగు మందుల వాడకం తగ్గించి నాణ్యమైన పంట చేతికి రావడానికి, అధిక ఆదాయం పొందడానికి కాయలు ఎదిగే దశలో పేపరు కవర్లు తొడగాలని ఉద్యాన శాఖ అధికారులు సూచిస్తున్నారు.
పేపర్ కవర్లు తొడగడం వల్ల లాభాలు
కాయ ఎదిగే దశలో కవర్లు తొడగడం వల్ల ఆ దశలో ఆశించే పురుగులు, ఈగల నుంచి రక్షణ పొందవచ్చు. ముఖ్యంగా పండు ఈగ బారిన పడకుండా కాయలను కాపాడొచ్చు. అదే విధంగా అకాల వర్షాలతో వ్యాపించే మసి తెగులు, బాక్టీరియా మచ్చ తెగులు, తేనె మంచు పురుగు, మంగు తెగులు, పక్షి కన్ను వంటి తెగుళ్లను కూడా ఎలాంటి సిలీంద్ర నాశినులు సోకకుండా సమర్థవంతంగా అరికట్టవచ్చు. కవర్లు తొడిగిన మామిడికాయలు మంచి రంగు సంతరించుకుని ఎలాంటి మచ్చలు లేకుండా చూడడానికి ఆకర్షణీయంగా కనిపించి కొనుగోలుదారులను ఆకర్షిస్తాయి. కవర్లు తొడిగితే పురుగు మందులు కొట్టాల్సిన అవసరం ఉండదు.
ఖర్చు తగ్గడంతోపాటు మందుల ఆవశేషాలు దూరం
మామిడి కాయలకు కవర్లను ఏర్పాటు చేయడం వల్ల రైతుకు ఖర్చు తగ్గుతుంది. దీంతోపాటు పురుగు మందులు కొట్టడం తగ్గడంతో హానికర పురుగు మందుల్లో అవశేషాలు పండులోకి చేరవు. దీంతో మామిడి పండ్లు తినే వారికి ఎటువంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు.
పక్షుల వల్ల కలిగే నష్టాలకు చెక్
కవర్లు తొడగడం వల్ల పక్షుల నుంచి కలిగే నష్టాన్ని నివారించవచ్చు. కాయ పెరిగే దశలో వచ్చే అధిక ఉష్ణోగ్రతలు, వడగాలులు లేదా అకాల వర్షాలతో కలిగే నష్టాన్ని సమర్థవంతంగా అరికట్టవచ్చు. కవర్లు తొడగడం వల్ల కాయలపై కొనతో ఏర్పడే మచ్చలను నివారించవచ్చు. కవర్లు తొడిగిన కాయలు త్వరగా పక్వానికి వస్తాయి. అధిక బరువు పెరగడం వల్ల దిగుబడి కూడా పెరుగుతుంది. కాయలో చెక్కర స్థాయిలు పెరుగుతాయి. కోసిన తర్వాత ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. మార్కెట్లో అధిక ధర వస్తుంది. రైతుకు ఎక్కువ ఆదాయం లభిస్తుంది.
కవర్లు ఎప్పుడు, ఎలా తొడగాలి
కవర్లు ఏ దశలో తొడగాలి అనే అంశం చాలా ముఖ్యం. మరీ లేత దశ అంటే పిందే దశ లేదా గోలీకాయ సైజులో తొడగొద్దు. అలా తొడిగితే కాయ కాడ లేతగా ఉండటం వల్ల కవర్ బరువు తట్టుకోలేక విరిగిపోతుంది. ఒకవేళ మరీ ఆలస్యంగా తొడిగితే అప్పటికే అన్ని రకాల పురుగులు, తెగుళ్లు ఆశించడంతో ఆశించిన మేర నాణ్యమైన పండ్లను పొందలేం. అందుకే కాయ సుమారు 100 గ్రాములు బరువు ఉన్నప్పుడు కవర్లు తొడగాలి. అంటే పూత నుంచి సుమారు 55 నుంచి 60 రోజుల తర్వాత తొడగాలి. అంటే కోడిగుడ్డు లేదా నిమ్మకాయ సైజులో ఉన్నప్పుడు తొడగాలి. కవర్లు తొడిగిన 50 – 60 రోజులకు కాయ పక్వానికి వస్తుంది. అప్పుడు కవర్లను తొలగించి కాయలను కోసుకోవాలి.
కవర్లపై గుర్తులు వేసుకోవాలి
మామిడికాయలు అన్నీ ఒకే దశలో రావు. కాయలకు కవర్లు తొడిగేటప్పుడు మనం తొడిగిన తేదీలు లేదా నంబర్లు వేసుకుంటే ముందు ఏది తొడిగాము, తొడిగిన తర్వాత ఎన్ని రోజులు అయ్యిందో సులభంగా తెలుసుకోవచ్చు. దాని ప్రకారం కాయలు కోసుకోవచ్చు. పేపర్‌తో తయారు చేసిన కవర్లు మాత్రమే ఉపయోగించుకోవాలి. పాలిథిన్ కవర్లు వాడకూడదు. పేపర్ కవర్లు ఉపయోగిస్తే లోపల గాలి బయటకు, బయట గాలి లోపలకు వెళ్లే అవకాశం ఉంది. కాయ నాణ్యంగా ఉంటుంది.
కవర్ల ఏ విధంగా తొడగాలంటే...
కాయకు కవర్ తొడిగేటప్పుడు కవర్ అడుగుకు కాయ తగలకుండా కొంచెం ఖాళీ ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే కాయ పెరుగుతున్నప్పుడు కవర్ పగిలిపోకుండా ఉంటుంది. కవర్లు వర్షం పడుతున్నప్పుడు లేదా మంచు పడే సమయాల్లో తొడగొద్దు ఎండ ఉన్న రోజు లేదా అలాంటి సమయాల్లో తొడగాలి. కవర్లు తొడిగేటప్పుడు పురుగులు, తెగుళ్లు సోకని కాయలను ఎంపిక చేసుకోవాలి. కవర్లు తొడిగిన తర్వాత అమర్చిన వైరుతో కాడకు జాగ్రత్తగా ఎలాంటి ఖాళీ లేకుండా తొడగాలి. ఖాళీ ఉంటే పురుగులు, సిలీంద్రాలు ఖాళీ ద్వారా ప్రవేశిస్తాయి. ఒకవేళ వర్షం పడితే నీరు కూడా కాడ ద్వారా లోపలికి ప్రవేశించి కాయ పాడైపోతుంది.


