వస్త్ర దుకాణంలో అగ్నిప్రమాదం | - | Sakshi
Sakshi News home page

వస్త్ర దుకాణంలో అగ్నిప్రమాదం

Mar 4 2026 7:39 AM | Updated on Mar 4 2026 7:39 AM

పులివెందుల రూరల్‌ : పులివెందుల పట్టణంలోని సెంట్రల్‌ బోలే వార్డు పాత కరెంట్‌ కార్యాలయ సమీపంలోని పీటర్‌ ఇంగ్లాండ్‌ వస్త్ర దుకాణంలో మంగళవారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. షాపులోని వైర్లు షార్ట్‌ సర్క్యూట్‌ కావడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. వెంటనే స్థానికులు అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అయితే అప్పటికే సుమారు రూ.3 లక్షల దాకా వస్త్రాలు కాలిపోయినట్లు బాధితులు తెలిపారు.

నిందితుడికి రిమాండ్‌

కాశినాయన : మండలంలోని పాపిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన పాలకొలను సీతారామిరెడ్డి అనే నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్‌ఐ యోగేంద్ర కథనం మేరకు.. రెడ్డిపల్లె గ్రామానికి చెందిన వర్రా రాజు మేకలను మేపుకొనేందుకు పొలానికి వెళ్లాడు. ఒక మేక తప్పిపోవడంతో సమీపంలోని పొలంలోకి వర్రా రాజు వెళ్లాడు. అడవి పందుల నుంచి పంటను కాపాడుకునేందుకు పొలం యజామని పాలకొలను సీతారామిరెడ్డి విద్యుత్‌ కంచెను ఏర్పాటు చేశాడు. ఇది గమనించని రాజు విద్యుత్‌ షాక్‌కు గురై మరణించాడు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి సీతారామిరెడ్డిని అరెస్టు చేశారు. అతన్ని కోర్టులో హాజరుపరచగా 14 రోజులు రిమాండ్‌ విధించినట్లు ఎస్‌ఐ తెలిపారు.

గుర్తు తెలియని వ్యక్తి మృతి

నందలూరు : మండలంలోని నాగిరెడ్డిపల్లి మేజర్‌ గ్రామ పంచాయతీ రైల్వేగేట్‌ సమీపంలో మంగళవారం మధ్యాహ్నం ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందిన సంఘటన చోటు చేసుకుంది. ప్రతి మంగళవారం పలువురు భిక్షాటన కోసం నందలూరుకు వస్తూ ఉంటారు. అలా వచ్చిన వారిలో ఒక వ్యక్తి మద్యం తాగి మృతిచెందినట్లు సమాచారం. ఈ విషయంపై సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించగా ఎటువంటి ఆనవాళ్లు దొరకలేదు. దీంతో అతనితోపాటు వచ్చిన వారి కోసం గాలించారు. మృతుడి వివరాల కోసం ప్రయత్నిస్తామని, దొరకని పక్షంలో దహన సంస్కారం నిర్వహిస్తామని పోలీసులు తెలిపారు.

రేపిస్టును పట్టుకున్న స్థానికులు

మైదుకూరు : ఓ చిన్నారిపై అత్యాచారయత్నం చేయబోయిన రేపిస్టును స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించిన సంఘటన మైదుకూరులో మంగళవారం జరిగింది. స్థానిక శ్రీరామ్‌నగర్‌లో 8 ఏళ్ల బాలికపై అత్యాచార యత్నం చేయబోయిన వ్యక్తిని ఓ బాలుడు గమనించి చుట్టుపక్కల వారిని కేకలు వేసి పిలిచాడు. అందరూ అక్కడికి చేరుకొని ఆ అగంతుకుడిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించినట్లు తెలుస్తోంది. చిన్నారులను కిడ్నాప్‌ చేసి అత్యాచారం చేసేందుకు అగంతుకుడు వీధుల్లో తిరుగుతుంటాడని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement