జకాత్‌.. పేదల హక్కు | - | Sakshi
Sakshi News home page

జకాత్‌.. పేదల హక్కు

Mar 4 2026 7:39 AM | Updated on Mar 4 2026 7:39 AM

కమలాపురం : ‘అర్హత ఉన్న ప్రతి ముస్లిం జకాత్‌ను చెల్లించడం విధిగా పాటించాలి. జకాత్‌ పేదల హక్కు. ప్రతి ఏటా తమ వద్ద నిల్వ ఉన్న సొమ్ముపై జకాత్‌ తప్పనిసరిగా చెల్లించాలి’ అని స్థానిక దర్గా–ఏ గఫారియా, జహీరియా పీఠాధిపతి సజ్జాద్‌–ఏ–నషీన్‌ ఫైజుల్‌ గఫార్‌ షా ఖాద్రి తెలిపారు. ఽ52 తులాల వెండి లేదా 7.5 తులాల బంగారం లేదా వాటి విలువతో సమానంగా ఉన్న ధనం పై జకాత్‌ చెల్లించాలని ఆయన వివరించారు. కనీసం ఏడాది పాటు మన వద్ద నిల్వ ఉన్న ధనంపై జకాత్‌ చెల్లించాలని, మన ఖర్చు పోను మిగిలి ఉన్న ధనంపై మాత్రమే జకాత్‌ చెల్లించాల్సి ఉంటుందన్నారు. మనం నివాసం ఉన్న ఇంటిని కాకుండా ఇతర నివాస యోగ్యమైన బిల్డింగులపై వచ్చే ఆదాయంపై కూడా జకాత్‌ చెల్లించాలన్నారు. తమ వద్ద ఉన్న సొమ్ములో 2.5 శాతం జకాత్‌ను తీసి పేదలకు పంచి పెట్టాలని, పేదలు కూడా ధనవంతులతో సమానంగా సంతోషంగా పండుగ జరుపుకోవడం కోసమే అల్లాహ్‌ జకాత్‌ అర్హులైన ముస్లిం సోదరులపై వాజిబ్‌ చేశారని తెలిపారు. అలాగే వర్షాధారంతో పంటలు పండించే భూములున్న వారు పండిన పంటలో 1/10వ వంతు, బోర్ల కింద సాగు చేసే వారు 1/20వ వంతు జకాత్‌ చెల్లించాలన్నారు. అర్హులైన వారు సంవత్సరంలో ఒక సారి జకాత్‌ తప్పనిసరిగా చెల్లించాలని, అయితే రంజాన్‌ మాసంలో జకాత్‌ దానం చేస్తే 70 శాతం పుణ్యం అధికంగా లభిస్తుందన్నారు.

జకాత్‌ పొందడానికి అర్హులు, అనర్హులు ఎవరు..

జకాత్‌ పొందడానికి పేదలు అర్హులు. జకాత్‌ సొమ్మును ముందుగా తమ బంధువుల్లో ఉన్న పేదలకు పంచాలి. తర్వాత ఇతర ముస్లింలకు పంచవచ్చు. ప్రయాణంలో ఉన్న వారు ఇబ్బందులు పడుతుంటే వారి అవసరాలకు తగిన మేరకు మాత్రమే జకాత్‌ సొమ్ము ఇవ్వవచ్చు. అలాగే తల్లిదండ్రులకు, సయ్యద్‌ కుటుంబాలకు, మదరసాలు, మస్జిద్‌లు, దర్గాలకు ఎటువంటి పరిస్థితిలో జకాత్‌ చెల్లించకూడదు.

జకాత్‌తో ప్రయోజనం ఏమి..

మనం స్నానం చేస్తే ఒంటిపై ఉన్న మురికి ఎలా తొలగిపోతుందో మన వద్ద ఉన్న సొమ్ముపై జకాత్‌ చెల్లిస్తే.. మన సొమ్ముపై ఉన్న మురికి కూడా తొలగి స్వచ్ఛంగా ఉంటుంది.

ఉపవాసం పాటించలేని వారు ‘ఫిదియా’ ఇవ్వాలి

అనారోగ్యం బారిన పడి, లేదా ఇతర కారణాలతో ఉపవాసం పాటించలేని స్థితిలో ఉన్న వారు ఒక వ్యక్తికి రెండు పూటల భోజనం తినడానికి ఎంత ఖర్చు అవుతుందో అంత ఖర్చును ఉపవాసం పాటించే వారికి ఇవ్వాలి. దీనిని ఫిదియా అంటారు.

ఇదుల్‌ ఫితర్‌ రోజు ఉపవాసం పాటించరాదు

రంజాన్‌ మాసం పూర్తి అయ్యాక షవ్వాల్‌ మాసం మొదటి రోజున ఇదుల్‌ ఫితర్‌ పండుగ జరుపుకుంటాం. అయితే ఆ రోజు ఉపవాసం పాటించరాదు. అలా ఉపవాసం పాటిస్తే అది హరాం అవుతుంది.

దర్గా పీఠాధిపతి ఫైజుల్‌ గఫార్‌ షా ఖాద్రి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement